కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు! | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు!

Published Sun, May 19 2024 5:06 AM

Kaleswaram barrages are being repaired on war footing

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం!

వర్షాకాలానికి ముందే ఎన్డీఎస్‌ఏ కమిటీ సూచించిన చర్యలన్నీ తీసుకోవాలి

నిర్మాణ సంస్థలు ముందుకు రాకపోతే కఠినచర్యలు... అదే సమయంలో బ్యారేజీలకు తదుపరి పరీక్షలు జరపాలి

వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన ఇంజనీర్లపై చర్యలు దిశగా అడుగులు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.  కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇటీ వల సమర్పించిన మధ్యంతర నివేదికలో సిఫారసు చేసిన అత్యవసర మరమ్మతులు, తదుపరి పరీక్షలను ఏకకాలంలో చేపట్టాలని అధికారులను ఆదే శించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 

విశ్వసనీయ సమాచారం మేరకు.. వర్షాలు ప్రారంభం కాకముందే వీలైనవన్నీ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పనుల పురోగతిపై రోజువారీగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి నివేదిక సమర్పించాలని ఆ శాఖను కోరింది. కమిటీ సిఫారసు చేసిన  మేరకు సీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, ఎన్జీఆర్‌ఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో బ్యారేజీల్లోని లోపాలపై తదుపరి పరీక్షలు (ఇన్వెస్టిగేషన్లు) జరిపించాలని సూచించింది. జియో టెక్నికల్, జియోఫిజికల్‌ పరీక్షల నిర్వహణ కోసం ఒక్కో సంస్థకు ఒక్కో బ్యారేజీ బాధ్యతలను అప్పగించనుంది. మరమ్మతులు, పరీక్షలు ఏకకాలంలో నిర్వహించాలని ఆదేశించింది. 

మేడిగడ్డలో ఆ గేట్లు ముందే ఎత్తేయండి
మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ఏడో నంబర్‌ బ్లాక్‌లోని గేట్లన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎత్తివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పియర్లు కుంగిపోవడంతో 20, 21వ నంబర్‌ గేట్లను ఎత్తడం సాధ్యం కాదని, వాటి విడిభాగాలను విడదీసి తొలగిస్తామని ఇంజనీర్లు వివరించారు. 

ఆ ఇంజనీర్లపై సస్పెన్షన్‌ వేటు!
బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సొంత బాధ్యతతో నిర్వహించడానికి నిర్మాణ సంస్థలు ముందు వస్తే సరి.. లేకుంటే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ తర్వాత అవసరమైన నిధులు ఇస్తామని తెలిపారు. డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ పూర్తికాకపోయినా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు ధ్రువీకరిస్తూ వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీకి వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఒక సూపరింటెండింగ్‌ ఇంజనీర్, మరో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. 

నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై కూడా..
ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్‌ సమర్పించిన మధ్యంతర నివేదికల ఆధారంగా బ్యారేజీల నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీకి మరమ్మతుల నిర్వహణకు ఇంకా ముందుకు రాని నిర్మాణ సంస్థను రప్పించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. 

అన్నారం, సుందిళ్ల నుంచి సాగునీరు
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో దానికి ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీళ్లను ఎత్తిపోసి వచ్చే వానాకాలంలో రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement