రాజ్యాంగం సజీవం | Judicial, executive systems should work towards same goal says Justice Suryakant | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం సజీవం

Apr 6 2026 2:16 AM | Updated on Apr 6 2026 2:16 AM

Judicial, executive systems should work towards same goal says Justice Suryakant

హైకోర్టు జోన్‌–2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌. చిత్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌

న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల ఒకే లక్ష్యంతో అది సాధ్యం 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌

నూతన హైకోర్టు జోన్‌–2 భవన నిర్మాణ పనులకు సీజేఐ భూమిపూజ 

ఈ కార్యక్రమం లాంఛనం కాదు.. రాజ్యాంగ విధి 

కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సమాంతరంగా సాగడం సరైనదే 

తెలంగాణ వచ్చాక దశాబ్ద కలకు కార్యరూపం ఈ భవన నిర్మాణం 

రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అభినందించిన సీజేఐ 

అన్ని మతాల ప్రజల దేవాలయం ఈ న్యాయాలయం: సీఎం రేవంత్‌ 

కొత్త హైకోర్టు నిర్మాణం ప్రభుత్వానికి గౌరవప్రదమని వెల్లడి  

పాల్గొన్న సుప్రీం న్యాయమూర్తులు, హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగం సజీవంగా ఉండాలంటే న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే లక్ష్యంతో పనిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్మించే నూతన హైకోర్టు జోన్‌–2 భవన నిర్మాణ పనులకు ఆదివారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎస్వీ భట్టి, జస్టిస్‌ అలోక్‌ అరాధే, హైకోర్టు సీజే జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌తో కలసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం సీజేఐ మాట్లాడారు. ఈ కార్యక్రమం లాంఛనం కాదని.. రాజ్యాంగ విధి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ద కల కార్యరూపం దాలుస్తోందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ సహకారం అభినందనీయమన్నారు. 

మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి..: ‘న్యాయవ్యవస్థలో నా సుదీర్ఘ వృత్తి జీవితంలో నేను ఒకటి నమ్ముతాను. ప్రతి కార్యానికి మూడు దశలు ఉంటాయి. ప్రారంభం ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది. మధ్యభాగం పట్టుదలను ప్రదర్శిస్తుంది. ముగింపు వాగ్దానం నెరవేరిందా లేదా అనేది తెలియజేస్తుంది. ప్రజలంతా న్యాయపీఠం, చిహ్నం, కార్యకలాపాలను మాత్రమే చూస్తారు. అదే మనకు కనిపించే న్యాయవ్యవస్థ. కానీ ప్రతి కోర్టు గది వెనుక దాన్ని నడిపించే ఓ ప్రపంచం ఉంటుంది. అక్కడే న్యాయమూర్తులు నివసిస్తారు.. శిక్షణ పొందుతారు.. తీర్పులు భద్రపరుస్తారు.. ఈరోజు దానికి మనం పునాది వేస్తున్నాం. మనం ఇక్కడికి రావడం లాంఛనం కాదు.. రాజ్యాంగ విధి. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలన్న సూత్రాన్ని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. ప్రతి రాష్ట్రంలో ఓ హైకోర్టు ఏర్పాటు చట్టపరమైన అవసరమే కాకుండా గణతంత్ర రాజ్య నిబద్ధతగా ఎప్పుడూ భావిస్తాను. 

అలాంటి నిబద్ధతకు.. అందుకు ఆధారమైన మౌలిక సదుపాయాలు ఉన్నంత వరకే అర్థం ఉంటుంది. అది లేకుంటే కేవలం కాగితాల్లోనే మిగిలిపోతుంది. తెలంగాణలో అది నిర్ధిష్ట రూపాన్ని సంతరించుకుంటోంది. జోన్‌–1లో పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ భవనాలు ఓపక్క రూపుదిద్దుకుంటుండగానే జోన్‌–2 మొదలవుతోంది. న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. అది సరైనదే. ప్రస్తుత భవనం చారిత్రాక కట్టడం అయినప్పటికీ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. రాబోయే వందేళ్ల అవసరాలు తీర్చే మౌలిక సదుపాయాలను కల్పించడం ఓ లక్ష్యం మాత్రమే కాదు.. తప్పనిసరి. కోర్టు గదులతోపాటు జోన్‌–2 కూడా అంతే ముఖ్యం. చెట్టులో మనకు కొమ్మలు, ఎత్తు మాత్రమే కనిపిస్తాయి. కానీ తుపాను వచ్చినప్పుడు వేర్లు మాత్రమే దాన్ని కాపాడతాయి. జోన్‌–2 న్యాయవ్యవస్థకు వేర్లలాంటింది’అని పేర్కొన్నారు. 

దశాబ్దం తర్వాత కార్యరూపం.. 
‘హైకోర్టు రోజువారీ కార్యకలాపాలు తన నియంత్రణలో లేని ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ 100 ఎకరాల ప్రాంగణం ఆ పరిస్థితిని మారుస్తుంది. సంస్థాగత స్వయం సమృద్ధిని సిద్ధాంతం నుంచి ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు అది ఇలానే కనిపిస్తుంది. ఇక్కడ నిర్మించబోయే ఆడిటోరియంలో న్యాయవ్యవస్థకు శిక్షణా కార్యక్రమాలు, పౌరుల కోసం న్యాయ అవగాహన శిబిరాలు నిర్వహించడం శుభ పరిణామం. సెంట్రల్‌ రికార్డ్‌ రూమ్‌.. తీర్పులను భద్రపర్చడం అత్యంత ప్రాధాన్యం. ప్రస్తుత హైకోర్టులో 2009లో చోటుచేసుకున్న ఓ అగ్నిప్రమాదం కొత్త భవన నిర్మాణానికి బీజం వేసింది. 

ఫుల్‌ కోర్టు ఆమోదం, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ల ప్రస్తావనతో దశాబ్దం తర్వాత కార్యరూపం దాల్చింది. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు న్యాయ వ్యవస్థకు సదుపాయాల కల్పనకు ముందు వస్తున్నాయి. అత్యంత అవశ్యకం అని గుర్తిస్తున్నాయి. ఇది గొప్ప విషయం. రూ. 2,583 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ సహకారాన్ని అభినందిస్తున్నా. న్యాయవ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ ఒకే లక్ష్యంతో పనిచేస్తే రాజ్యాంగం నిజంగా సజీవంగా నిలుస్తుంది. ఇక్కడి నుంచి తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు మార్గదర్శకం కావాలి’అని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆకాంక్షించారు. 

రాబోయే వందేళ్లకు న్యాయ వేదిక: సీఎం రేవంత్‌రెడ్డి 
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఇదో ప్రత్యేకమైన రోజు. మన దేశంలో దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మించడం గొప్ప విషయం. కానీ న్యాయం కోసం ఓ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడమంటే అన్ని మతాల ప్రజల కోసం ఓ పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లే. మన ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర ఆధారితంగా, గౌరవంగా పనిచేస్తాయి. సామాన్య పౌరుడికి కోర్టు ఓ చివరి ఆశ. తెలంగాణ కోసం కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం మా ప్రభుత్వానికో గొప్ప అవకాశం. ఈ భవనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. 

రాబోయే వందేళ్లపాటు పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వేదికగా సేవలందిస్తుంది. ఇది మా ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం. వ్యవస్థలు పరస్పర గౌరవంతో, సహకారంతో పనిచేయాలి. ఈ భవనం దేశంలోని అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఒకటి మాత్రమే కాదు.. అత్యాధునిక, మౌలికవసతుల ప్రమాణంగా ప్రఖ్యాతి చెందుతుంది. అందుకే ప్రభుత్వం ఏర్పడగానే రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల భూమిని కేటాయించాం. జోన్‌–1 పనులు శరవేగంగా సాగుతున్నాయి. జోన్‌–2 పనులను కూడా 2027 డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి చేస్తాం. తీర్పులకే కాదు.. న్యాయ వ్యవస్థ అభిప్రాయాలకూ అత్యున్నత గౌరవం ఇస్తాం’అని వెల్లడించారు. 

ప్రతి వ్యక్తికి భరోసా కల్పించాలి: జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ 
రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ప్రధాన కోర్టు సముదాయం, కార్యాలయ భవనాల జోన్‌–1 ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడు నివాస బంగళాలు, అనుబంధ నిర్మాణాలు, ఆడిటోరియం, సెంట్రల్‌ రికార్డ్‌ రూమ్‌.. జోన్‌–2ను ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. కోర్టులు ఆస్పత్రుల్లా పనిచేయాలని సీజేఐ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. అక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికీ భరోసా, విశ్వాసం కల్పించే ప్రదేశాలుగా ఉండాలి. 

న్యాయం అందించడమే కాదు.. దాన్నిపౌరులు అనుభూతి పొందాలి’అని అభిలíÙంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్టార్లు, ఏజీ సుదర్శన్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఎస్‌.సురేందర్‌రెడ్డి, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, హెచ్‌సీఏఏ ఉపాధ్యక్షుడు డీఎల్‌ పాండు, కార్యదర్శులు శ్రావణ్‌కుమార్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement