జూన్‌ 2న పీఆర్సీ ప్రకటించాలి | JAC Leaders Sensational Reaction on Retired Employees Pending Dues | Sakshi
Sakshi News home page

జూన్‌ 2న పీఆర్సీ ప్రకటించాలి

Apr 11 2026 1:13 AM | Updated on Apr 11 2026 1:13 AM

JAC Leaders Sensational Reaction on Retired Employees Pending Dues

విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న లచ్చిరెడ్డి

పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు కూడా విడుదల చేయాలి

డిమాండ్ల సాధనకు 17న భోజన విరామ సమయంలో ఉద్యోగుల నిరసన

మే 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ: తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్‌ 2వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్‌ ఒ.రాజశేఖర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యల పరి ష్కారమే లక్ష్యంగా కార్యాచరణను ఈ సమావేశంలో ప్రకటించగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వి.లచ్చిరెడ్డి, రాజశేఖర్‌ మాట్లాడారు. జూన్‌ రెండో తేదీన పీఆర్సీ అమలుతోపాటు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఐదు డీఏలను కూడా విడుదల చేయాలన్నారు.

పీఆర్సీ కమిటీ గడువును పొడిగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ చేయాలని, ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు జారీ చేసి తక్షణమే అమల్లోకి తీసుకురావాలన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్‌ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ నెల 17న ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మండల, డివిజన్‌ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించాలన్నారు. మే 5వ తేదీన జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడంతోపాటు ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ శాఖలో 630మంది సిబ్బంది తొలగింపును తీవ్రంగా వ్యతిరేకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement