అక్కడ తిప్పలు ఇక్కడ అప్పులు! | Indian Students Face Challenges Regarding USA Education | Sakshi
Sakshi News home page

అక్కడ తిప్పలు ఇక్కడ అప్పులు!

May 30 2026 4:39 AM | Updated on May 30 2026 4:39 AM

Indian Students Face Challenges Regarding USA Education

అమెరికా విద్యకు అష్టకష్టాలు

నిబంధనల కళ్లెం.. రూపాయి పతనంతో అదనపు ఖర్చులు... పార్ట్‌టైమ్‌ ఉద్యోగానికి అవకాశం లేకపోవడంతో అవస్థలు 

ఒక్కో విద్యార్థికి రూ.5 నుంచి 8 లక్షల వరకు పెరిగిన భారం... పిల్లల పరిస్థితి, అప్పుల భారంతో తల్లిదండ్రుల మనోవేదన 

కొత్తగా యూఎస్‌ వెళ్లాలనుకునే వారికీ తిప్పలే 

పెరిగిన వీసా ఫీజు.. నిబంధనలతో చుక్కలు 

స్లాట్‌ దొరకడం గగనం.. దొరికితే సవాలక్ష శోధనలు

డబ్బులన్నీ ఫీజులకే.. 
రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి సుమిత్‌ వేల్పుల ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎంఎస్‌ కోసం అమెరికా వచ్చిన తనకు రూపాయి పతనంతో ఏటా రూ.5 లక్షల అదనపు భారం పడుతోందని చెప్పాడు. డబ్బులన్నీ ట్యూషన్‌ ఫీజుకే పోతున్నాయని తెలిపాడు. అమ్మ గొలుసు అమ్మి యూఎస్‌ వచ్చానని, కూలీ పనికి వెళ్లే అమ్మ, చిరుద్యోగి నాన్నను డబ్బులు అడగలేక కొన్నిసార్లు పస్తులు ఉంటున్నట్టు చెప్పాడు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం దొంగచాటుగా చేస్తూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నానని కన్నీరు మున్నీరయ్యాడు. .

ఒక్క పూటే తింటూ.. 
ఖమ్మంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవనీత్‌ వర్మ తన కొడుకును అమెరికా పంపారు. ఇందుకోసం రూ.35 లక్షల అప్పు చేశారు. జీతంలో 80% ఈ అప్పు కింద వడ్డీకే కడుతున్నారు. ఈ క్రమంలో భార్యకు గుండెపోటు వస్తే ఇల్లు తాకట్టు పెట్టి మళ్లీ అప్పు చేశారు. అమెరికాలో చదువుతున్న కొడుకు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఒక్క పూటే తింటున్నాడని తెలిసి నవనీత్‌ తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. కొడుకు డబ్బులు పంపమని 
అడగలేక అడిగిన తీరు గుర్తు చేసుకుంటూ బావురుమన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా విద్య విద్యార్థులను హడలెత్తిస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో కలలతో ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాలనుకునే వారిని, ఇప్పటికే అక్కడ ఉండి చదువును కొనసాగిస్తున్న వారిని ప్రస్తుత పరిస్థితులు బెంబేలెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు..డాలర్‌ దూకుడు.. రూపాయి పతనం.. తల్లిదండ్రులు, విద్యార్థులకు శాపంగా మారాయి. పెరిగిన ఖర్చులు గుండె దడ పుట్టిస్తున్నాయి. అమెరికా వెళ్లాలంటే వీసా నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. స్లాట్‌ దొరకడమే కష్టంగా ఉంటే, వీసా రావడం దైవాధీనంగా మారింది.

మరోవైపు యూఎస్‌లో విద్యార్థులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ట్రంప్‌ ప్రభుత్వ నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందోననే ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేసే అవకాశం లేక, యూఎస్‌ విద్య కోసం చేసిన అప్పులు గుదిబండగా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల తిప్పలు వర్ణనాతీతం. పిల్లలు తినీ తినకా..ఫీజులు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు కావాలని అడుగుతుంటే వారి గుండె తరుక్కుపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొందరితో ‘సాక్షి’ మాట్లాడింది. ఎవర్ని కదిలించినా.. కన్నీటి కథలు.. గుండెల్ని పిండే వ్యథలే..  

డాలర్‌ కరాళ నృత్యం 
అమెరికా చదువు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు చేసిన విద్యార్థుల ఆర్థిక ప్రణాళిక పూర్తిగా మారిపోయింది. ఏడాది క్రితం వరకూ రూపాయి తో పోలిస్తే డాలర్‌ విలువ రూ.83. ప్రస్తుతం ఇది రూ. 96కు చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీనికి కారణం కాగా.. ఇది విద్యార్థులపై భారాన్ని పెంచింది. యూనివర్సిటీని బట్టి ఫీజులుంటాయి. వర్సిటీల ట్యూషన్‌ ఫీజు 30 వేల నుంచి 32 వేల డాలర్ల వరకూ ఉంటుంది. ఒక్కో విద్యార్థికి రూ.35 లక్షల నుంచి 50 లక్షల వరకూ ఖర్చవుతుంది.

రూపాయి పతనంతో ఫీజు 35 వేల నుంచి 40 వేల డాలర్లకు చేరింది. హాస్టల్, ఇన్సూరెన్స్, ప్రయాణ ఖర్చులు అదనం. ఫీజుతో పాటు ఇప్పుడీ ఖర్చులన్నీ పెరిగాయి. భారతీయ విద్యార్థులపై ఈ ఏడాది రూ.5 లక్షల నుంచి 8 లక్షల అదనపు భారం పడిందని, బ్యాంకు రుణం కాకుండా మరో రూ.20 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని ఇటీవల యూఎస్‌ వెళ్ళిన ఖమ్మం విద్యార్థిని మాధవి తండ్రి ప్రణబ్‌ తెలిపారు. ప్రతి నెలా అప్పుపై వడ్డీకే రూ.30 వేలు కడుతున్నట్టు వాపోయారు.   

టెన్షన్‌ పుట్టిస్తున్న వీసాలు 
వీసా ఫీజు గతంలో 160 డాలర్లు ఉండేది. ఇప్పుడది 180 డాలర్లు అయ్యింది. బయోమెట్రిక్, డాక్యుమెంటేషన్‌ ధ్రువీకరణ.. ఇలా వీసా ఖర్చు అమాంతం పెరిగింది. మన దేశం నుంచి ఏటా  సగటున 7 లక్షల మంది విదేశీ విద్య కోసం వెళ్తారు. ఇందులో 3 లక్షల మంది అమెరికాకే వెళ్తున్నారు. అమెరికా వర్సిటీల్లో రెండు దశల్లో ప్రవేశాలు చేపడతారు. ఫాల్‌ సెమిస్టర్‌గా భావించే మే, జూన్‌ నెలలు కీలకం. ఆరు నెలల ముందు నుంచే విద్యార్థులు దీనికోసం ప్రణాళిక రూపొందించుకుంటారు. ప్రవేశాలను ఖరారు చేసుకుని వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు. అయితే యూఎస్‌ ఈ ఏడాది 38 శాతం వీసాలకు కోత పెట్టింది. కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.

విద్యార్థి ఆర్థిక పరమైన లావాదేవీలను నిశితంగా పరిశీలించాలని యూఎస్‌ కాన్సులేట్‌ను ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో విద్యార్థి చేసిన పోస్టులనూ వెతకాలని, ఎవరెవరితో లింక్‌లున్నాయి? యూఎస్‌లో ఉండే వారితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు? ఇలాంటివన్నీ శోధించాలని పేర్కొంది. దీంతో వీసాలకు అలస్యమవుతోంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై ఎక్కడ స్టాట్‌ వస్తుందో తెలియని పరిస్థితి. స్లాట్‌ వచ్చినా వీసా గ్యారంటీ ఉండటం లేదు. గడచిన 3 నెలలుగా 120 మంది తెలుగు విద్యార్థుల వీసాలను చిన్న కారణాలతో నిలిపివేశారు.

‘యూఎస్‌లో ఓ స్నేహితుడితో చాట్‌ చేశాను. అతని బ్యాక్‌ గ్రౌండ్‌ సరిగా లేదని వీసా ఆపేశారు..’ అని నెల్లూరుకు చెందిన ప్రభాకర్‌ మిన్నకంటి వాపోయాడు. బ్యాంకు స్టేట్‌మెంట్‌లో లావాదేవీలపై బ్యాంకు నుంచి వివరణ రాలేదని వీసా ఇవ్వలేదని వరంగల్‌కు చెందిన శ్రీకాంత్‌ మండేపూడి చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇతర దేశాల్లో ఎంఎస్‌ చేయడంపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కెనడా, ఆ్రస్టేలియా, జర్మనీ, ఐర్లాండ్‌ వంటి దేశాలపై దృష్టి పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement