సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడిపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ నగరంలో మాత్రం రిటైల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్ రూ.107.46, డీజిల్ రూ. 95.70 వద్ద స్థిరంగా కొనసాగాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది. తాజా తగ్గింపుతో పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.13 నుంచి రూ. 3కి పడిపోయింది.
డీజిల్‌పై రూ.10 సుంకాన్ని పూర్తిగా (సున్నాకు) తొలగించడం గమనార్హం. సాధారణంగా ఎక్సైజ్ సుంకం తగ్గితే వెంటనే పెట్రోల్ బంకుల్లో ధరలు తగ్గాలి. కానీ.. ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులు అంటున్నాయి ఆయిల్ కంపెనీలు. సామాన్యుడిపై భారం పడకుండా కేంద్రం నిర్ణయం ఉపశమనం కలిగించింది. 2021 నవంబర్‌లో పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10., 2022 మేలో పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది.


