హైదరాబాద్‌లో ఎండలు దంచికొడితే చిల్డ్‌ బీర్‌ పొంగాల్సిందే!

Increased Beer Sales In Greater Hyderabad Due To Summer - Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపంతో అల్లాడుతున్న మద్యం ప్రియులు బార్‌లు, వైన్‌షాపుల వద్ద బారులు తీరుతున్నారు. నిప్పులు  చెరిగే ఎండల బారి నుంచి ఉపశమనం కోసం చిల్డ్‌ బీర్‌ను  ఆశ్రయిస్తున్నారు. దీంతో గత రెండు నెలలుగా గ్రేటర్‌లో బీర్‌ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సాధారణ రోజుల్లో ‘కిక్‌’నిచ్చే  మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టగా బీర్‌ల అమ్మకాలు మాత్రం భారీగా పెరిగినట్లు ఆబ్కారీ వర్గాలు  తెలిపాయి. మార్చి, ఏప్రిల్‌ నెలలో ఇప్పటి వరకు గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 21,68,537 కేస్‌ల బీర్‌ల విక్రయాలు జరిగాయి. అమ్మకాల్లో  రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఒక్క జిల్లాలోనే ఈ నెలలో ఇప్పటి వరకు 7.57 లక్షల కేస్‌లకుపైగా బీర్‌లు అమ్ముడైనట్లు  అధికారులు తెలిపారు.
చదవండి👉: కన్నతండ్రి కళ్ల ముందే విగతజీవిలా మారితే.. దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదన

వేసవి ప్రభావంతో.. 
వేసవి  దృష్ట్యా మద్యం అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గత నెలలో  హైదరాబాద్‌లో 2.7 లక్షల కేస్‌లకు పైగా మద్యం విక్రయాలు జరగగా ఈ నెలలో ఇప్పటి వరకు 1.85 లక్షల కేస్‌లు మాత్రమే అమ్ముడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ మద్యం  విక్రయాలు 4.33 లక్షల కేస్‌ల నుంచి  ఈ నెలలో 3.97 లక్షల కేస్‌లకు తగ్గాయి. మేడ్చల్‌ జిల్లాలోనూ మద్యం అమ్మకాలపై వేసవి ప్రభావం పడింది.

మార్చిలో 82 వేలకుపైగా విక్రయించగా ఈ నెలలో 79  వేలకు పైగా మద్యం కేస్‌లు అమ్ముడయ్యాయి. ఆదాయంలోనూ  ఈ తేడా కొట్టొచ్చినట్లు ఉంది. గత నెలలో రంగారెడ్డి జిల్లాలో అన్ని రకాల మద్యం, బీర్‌ల  అమ్మకాలపై రూ.389 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.398.32 కోట్ల  ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో బీర్‌ల అమ్మకాలే టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్నాయి.

మే నెలలోనూ ఇదే హవా..? 
మరోవైపు వచ్చే మే నెలలోనూ ఐఎంఎల్‌ లిక్కర్‌ కంటే  బీర్‌ల అమ్మకాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు  ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌  నెలలో  రాష్ట్రవ్యాప్తంగా 19.30 లక్షల కేస్‌ల బీర్ల విక్రయాలు  జరిగాయి. ఈ నెలలో   ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.72 లక్షల కేస్‌ల  బీర్‌లు  అమ్ముడు కావడం  గమనార్హం. మే నెలలోనూ అమ్మకాల్లో ఇదే ఒరవడి కొనసాగనుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top