ఏప్రిల్‌ 30న కొత్త సచివాలయం ప్రారంభం

Inauguration of new secretariat on 30th April - Sakshi

అంబేడ్కర్‌ జయంతి రోజున 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ 

రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్‌ 2న అమరుల స్మారకం ప్రారంభం 

హుస్సేన్‌సాగర్‌ తీరాన మూడు ప్రధాన నిర్మాణాల ముహూర్తాలు ఖరారు 

ఆయా పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రారంభించే ముహూర్తాలను రాష్ట్ర ప్రభు త్వం ఖరారు చేసింది. కొత్త సచివాలయాన్ని ఏప్రిల్‌ 30న ప్రారంభించాలని, ఆలోపు అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అంతకన్నా ముందే అంబేడ్కర్‌ జయంతి అ యిన ఏప్రిల్‌ 14న 125 అడుగుల అంబేడ్కర్‌ వి గ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

తెలంగాణ ఆవిర్భవించిన జూన్‌ 2న అమరవీరుల స్మారక జ్యోతిని ప్రారంభించనున్నారు. ఈ 3 నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం వాటిని పరిశీలించారు. 

అనుకున్నట్టే అద్భుతంగా.. 
తొలుత సచివాలయాన్ని సందర్శించిన కేసీఆర్‌.. ప్రధాన ద్వారం, దానికి భోపాల్‌ నుంచి తెచ్చి ఏర్పాటు చేసిన వుడ్‌ కార్వింగ్, ఫౌంటెయిన్లు, పచ్చిక బయళ్లు, గుమ్మటాల పనులను.. ప్రహరీ, దాని అవతల వెడల్పు చేస్తున్న రోడ్లు, పార్కింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంతకుముందు పర్యటించినప్పుడు ఆరో అంతస్తులోని సీఎం చాంబర్‌లో చేయాల్సిందిగా సూచించిన మార్పులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. విగ్రహం దిగువన సిద్ధమవుతున్న విశాలమైన హాళ్లు, ఫౌంటెయిన్‌లు, పచ్చి క బయళ్లను పరిశీలించారు. పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతలో లోపం లేకుండా చూ డాలని ఆదేశించారు. తర్వాత తెలంగాణ అమరవీరుల స్మారక భవనం వద్దకు సీఎం చేరుకున్నారు.

ఆడిటోరియం, ప్రదర్శనశాల, లేజర్‌షో ప్రాంగణం, ర్యాంప్, సెల్లార్‌ పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుమన్, జీవన్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి తదితరులు ఉన్నారు. 

వరుసగా వాయిదా పడుతూ.. 
తొలుత దసరాకు, ఆ తర్వాత సంక్రాంతికి కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు భావించింది. కానీ పనులు పూర్తి కాకపోవటంతో వాయిదా వేసుకుంది. తర్వాత సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17ను ముహూర్తంగా ఖరారు చేసింది. పనులు పూర్తి కాకున్నా ప్రారంభించేందుకు సిద్ధమైంది.

అయితే సీఎం కార్యాలయం తప్ప మిగతావి పూర్తిస్థాయిలో సిద్ధం కావని అధికారులు పేర్కొనడంతో పునరాలోచించింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో మరోసారి వాయిదా వేసింది. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టినందున ఆయన జయంతి అయిన ఏప్రిల్‌ 14న ప్రారంభిస్తారని అనుకున్నారు.

కానీ ఆ రోజు కాకుండా ఏప్రిల్‌ 30ని ముహూర్తంగా ఎంచుకుంది. మార్చి 23 తర్వాత శూన్యమాసం మొదలై ఏప్రిల్‌ 29 వరకు కొనసాగుతుందని.. ఆ తర్వాతి రోజు (ఏప్రిల్‌ 30) వైశాఖ శుద్ధ దశమి నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయని పండితులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 30ను కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top