
సైనిక అవసరాల కోసం పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టి... సీఓఈల
ఏర్పాటుకు ఆర్మీ, నౌకా విభాగాల ఆసక్తి
లద్దాఖ్‌లో 3డీ ముద్రిత బంకర్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సిందూర్’నేపథ్యంలో దేశ సైనిక, రక్షణ రంగం ప్రదర్శించిన సాంకేతిక పాటవంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) కేంద్రంగా జరుగుతున్న రక్షణ రంగ పరిశోధనలు ఆసక్తికరంగా మారాయి. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీహెచ్‌లో ఇప్పటికే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేసింది. ఐఐటీహెచ్‌లో జరుగుతున్న పరిశోధనలు ఏఐ, అడిటివ్ మాన్యుఫాక్చరింగ్, బయో మెడికల్ రిసెర్చ్ వంటి రంగాల్లో భారత సైనిక బలగాలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సాగుతున్నాయి.
రక్షణ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లను కూడా ఐఐటీహెచ్ ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ, నౌకదళాలు కూడా ఐఐటీహెచ్‌లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 2030 నాటికి విదేశాల నుంచి దిగుమతి అవుతున్న రక్షణరంగ ఉత్పత్తులను సగానికి తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు పనిచేస్తాయి.
స్వదేశీ ఆవిష్కరణలు
డీఆర్‌డీఓ సహకారంతో ఐఐటీహెచ్‌లో 2023 ఏప్రిల్ 16న ‘డీఆర్‌డీఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’(డీఐఏ– సీఓఈ) ప్రారంభమైంది. రక్షణరంగ ఉత్పత్తుల్లో స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఇది పనిచేస్తోంది. హైపర్‌సోనిక్ వాహనాలకు అవసరమైన అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే మెటీరియల్స్ అభివృద్ధి చేయడంతోపాటు లార్జ్ ఏరియా అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (అధునాతన 3డీ ప్రింటింగ్) వంటి అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది.
రాకెట్ భాగాల తయారీకి దేశంలో అతిపెద్ద మెటల్ 3డీ ప్రింటర్‌ను ఉపయోగిస్తోంది. దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రాజెక్టులపై ఈ సీఓఈ దృష్టి సారిస్తోంది. మిస్సైల్ డిజైన్, ఆపరేషన్స్ కోసం కృత్రిమ మేధస్సు వినియోగం వంటి వాటిలో పరిశోధనలు సాగుతున్నాయి.
సైనిక వైద్య సవాళ్లకు పరిష్కారం
సైనికులు ఎదుర్కొంటున్న వైద్య సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంపైనా ఐఐటీహెచ్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్య పరిష్కారాలు, నవీన వైద్య పరికరాల అభివృద్ధి, శిక్షణ కోసం ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సరీ్వసెస్‌తో గత ఏడాది ఐఐటీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్‌లోని బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగాల నైపుణ్యాన్ని ఉపయోగించి సైనికుల ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. మరోవైపు నౌకా రంగంలో రక్షణ సాంకేతికతను మెరుగుపరిచేందుకు ఆవిష్కరణల కోసం నావికాదళంతో ఐఐటీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏబీసీడీ (ఆర్మీ, బోర్డర్, సైబర్, డ్రోన్స్) ప్రోగ్రామ్ ద్వారా స్టార్టప్‌లను రక్షణ సాంకేతిక ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తూ నిధులు సమకూర్చేందుకు సహాయపడుతోంది.
3డీ ముద్రిత సైనిక బంకర్లు
సైన్యం సహకారంతో ఐఐటీహెచ్‌కు చెందిన డీప్ టెక్ స్టార్టప్ ‘సింప్లిఫోర్జ్ క్రియేషన్స్’లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతంలో ‘ప్రాజెక్టు ప్రబల్’పేరిట సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఆన్‌సైట్ 3డీ ప్రింటెడ్ బంకర్‌ను నిర్మించింది. కేవలం 14 గంటల వ్యవధిలోనే రోబోటిక్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించింది. ఎక్కువ ఎత్తులో, తక్కువ ఆక్సిజన్, తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా లభించే పదార్థాలతో రూపొందించిన కస్టమ్ కాంక్రీట్ మిశ్రమాన్ని బంకర్ నిర్మాణంలో ఉపయోగించారు. హిమాలయ పర్వత సానువుల్లో కఠినమైన వాతావరణ పరిస్థితులు, శత్రుదాడుల నుంచి సైనికులను రక్షించడంలో ఈ బంకర్‌లు తోడ్పడతాయి. రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహిస్తే సాధించే ఫలితాలకు ఈ బంకర్ ఒక మైలురాయి వంటిదని ఐఐటీహెచ్ వర్గాలు చెప్తున్నాయి.
స్వదేశీ పరిజ్ఞానంతో ఆవిష్కరణలు –బీఎస్ మూర్తి, డైరెక్టర్, ఐఐటీహెచ్
ఐఐటీ హైదరాబాద్‌లో రక్షణ రంగానికి సంబంధించి అనేక సాంకేతిక పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక మీటరు నుంచి రెండున్నర మీటర్ల మీటర్ల ఎత్తుకలిగిన వస్తు సామగ్రిని ముద్రించే అధునాతన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఇక్కడ అభివృద్ధి చేశాం. 200 కిలోల పేలోడ్ లేదా ఇద్దరు వ్యక్తులను మోసుకెళ్లే డ్రోన్లను అభివృద్ధి చేశాం. సాంకేతికతల సంగమం, ఐఐటీహెచ్‌లోని వివిధ విభాగాల నడుమ భాగస్వామ్యాల ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు ఇక్కడ నుంచి వస్తాయి.