కొవిడ్‌ మరణాలను ముందే గుర్తించే టెక్నిక్‌ 

IIIT Hyderabad Model To Predict Covid19 Deaths - Sakshi

మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా ట్రిపుల్‌ ఐటీ పరిశోధకుల రూపకల్పన

సాక్షి, రాయదుర్గం: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు నిండిపోతున్నాయి, చాలా మంది రోగులు ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆస్పత్రిలో ఉన్నా, ఇళ్లలో ఉన్నా కొన్నిసార్లు శ్వాస సమస్య మొదలయ్యే వరకు రోగి పరిస్థితి సీరియస్‌ అవుతోందన్న విషయం గుర్తించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మెషీన్‌ లెర్నింగ్‌ నమూనాల ఆధారంగా.. కోవిడ్‌ మరణాలు సంభవించే అవకాశాన్ని ముందే గుర్తించే సాంకేతికతను రూపొందించినట్టు గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ పరిశోధకులు మంగళవారం ప్రకటించారు.

ట్రిపుల్‌ ఐటీ ప్రొఫెసర్‌ దేవప్రియకుమార్, పరిశోధక విద్యార్థులు షన్ముఖ్‌ అల్లె, అక్షయ కార్తికేయన్, అక్షిత్‌ గార్గ్‌ల బృందం ఈ పరిశోధన చేసిందని వారు వెల్లడించారు. కోవిడ్‌ వైరస్‌ ఉధృతిని బట్టి శరీరంలో జరిగే మార్పులు, హార్మోన్లు వంటి బయోమార్కర్ల సాయంతో మరణించే అవకాశాలను ముందే గుర్తించవచ్చని తెలిపారు. రక్తంలోని న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, లాక్టేట్‌ డీహైడ్రోజెనేస్‌ (ఎల్‌డీహెచ్‌), హైసెన్సివిటీ డీ–రియాక్టివ్‌ ప్రోటీన్‌ వంటి వాటి స్థాయిల ఆధారంగా.. 96 శాతం కచ్చితత్వంతో 16 రోజుల ముందుగానే మరణాలను అంచనా వేయొచ్చని పేర్కొన్నారు. ఈ డేటా ఆధారంగా కోవిడ్‌ పేషెంట్లకు అందించే చికిత్సను మెరుగుపర్చి, ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు.  

చదవండి: శ్మశానానికి దారి చూపుతూ నాయకుల ఫ్లెక్సీలు.. సిగ్గుందా మీకు! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top