ఫ్రిడ్జ్‌ అవసరం లేని ఇన్సులిన్‌!

IICT And IICB Invented New Insulin Injection For Sugar Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఇన్సులిన్‌ ఇంజెక్షన్లను ఫ్రిడ్జ్‌లలోనే నిల్వ చేసే పద్ధతికి ఇక స్వస్తి చెప్పవచ్చు. గది ఉష్ణోగ్రతలోనే కాదు.. మరింత ఎక్కువ వేడిని కూడా తట్టుకొని పనిచేయగల సరికొత్త ఇన్సులిన్‌ను హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ), కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (ఐఐసీబీ) సంయుక్తంగా అభివృద్ధి చేయడం దీనికి కారణం.

ఇప్పటివరకూ ఇంజెక్షన్ల రూపంలో తీసుకొనే ఇన్సులిన్‌ను కచ్చితంగా రిఫ్రిజరేటర్లలోనే నిల్వ చేయాల్సి వచ్చేది. లేదంటే కొన్ని గంటల వ్యవధిలోనే అందులో ఫిబ్రిలేషన్స్‌ (చిన్నచిన్న గడ్డలు కట్టడం) జరిగిపోయి అది వాడకానికి పనికిరాకుండా పోతుంది. అలాగని ఎక్కువ కాలం కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచినా అది పాడైపోతుంది. ఈ కారణంగానే ఇన్సులిన్‌ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా.. సాధారణ ఉష్ణోగ్రతల్లో ఉంచినా చెడిపోని ఇన్సులిన్‌ను తయారు చేయగలిగితే ఎన్నో లాభాలుంటాయి.

దీనిపై దృష్టిపెట్టిన ఐఐసీటీ, ఐఐసీబీ శాస్త్రవేత్తలు... ఓ పెప్టైడ్‌ ద్వారా ఇన్సులిన్‌కు ఉన్న లోపాలను పరిష్కరించవచ్చునని గుర్తించారు. నాలుగు అమినోయాసిడ్లతో కూడిన ఈ పెప్టైడ్‌కు వారు ‘ఇన్సులక్‌’ అని పేరు పెట్టారు. ఈ పెప్టైడ్‌ ఇన్సులిన్‌ గడ్డకట్టకుండా ఉండగలదని, వేడి కారణంగా జరిగే నష్టాన్నీ అడ్డుకోగలదని ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. అలాగే ఇన్సులక్‌ చేర్చడం వల్ల ఇన్సులిన్‌ పనితీరులో ఏ మార్పులూ కనిపించలేదు. ఇన్సులక్‌తో కూడిన ఇన్సులిన్‌ను సాధారణ గది ఉష్ణోగ్రతల్లోనే నెలలకొద్దీ నిల్వ చేయవచ్చని అంతర్జాతీయ జర్నల్‌ ‘ఐసైన్స్‌’లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. 

చదవండి: NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top