NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు

NGT: Telangana Government Arguments Over Palamuru Rangareddy Lift Irrigation Project - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తాగునీటిని అందించడానికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది. అయితే, కేంద్రం వైఖరి చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీ రైతుల డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలుకు 6 నెలల కాలపరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలైన పిటిషన్లను విచారించరాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసీ ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం.. తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు.

పర్యావరణ అనమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్‌రావు వెల్లడించారు. తాగునీటి కోసమే అయితే అంత సామర్థ్యమున్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు.. సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్లుంది కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణాలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్‌ ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోంందని రాంచందర్‌రావు చెప్పారు.

ప్రాజెక్టు సమీప 13 మండలాలు ఫోర్‌లైడ్‌ బాధిత గ్రామాలని, భూగర్భజలాలు వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని తుది విచారణలో తప్పకుండా తమ వైఖరి వెల్లడిస్తామని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం (నేడు) వింటామన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.    

చదవండి: టీఆర్‌ఎస్‌ జెండాను ఎత్తుకెళ్లిన దుండగులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top