రాజకీయ పార్టీ పెట్టబోతున్నా: వైఎస్‌ షర్మిల ప్రకటన

I Am Starting Political Party YS Sharmila Announced - Sakshi

ఖమ్మం: రాజకీయ పార్టీని పెట్టబోతున్నా అని వైఎస్‌ షర్మిల ఖమ్మం సంకల్ప సభ వేదికగా ప్రకటించారు. వైఎస్సార్‌ మొదలుపెట్టిన పాదయాత్ర రోజున కొత్త సంకల్పం తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ నేలతో ఉన్న అనుబంధంతో వచ్చానని చెప్పారు. రాజశేఖర్‌ రెడ్డి పాలన స్వర్ణయుగం అని తెలిపారు. ప్రశ్నించడానికి.. నిలదీయడానికి పార్టీ పెడుతున్నా అని తెలిపారు. రాజన్న రాజ్యం అందించడానికే కొత్త పార్టీ అని పేర్కొన్నారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మం అని ప్రసంగం మొదలుపెట్టారు. 

ఖమ్మం పెవిలియన్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన సంకల్ప సభలో తన తల్లి వైఎస్‌ విజయమ్మతో కలిసి షర్మిల పాల్గొన్నారు. అంతకుముందు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్‌ విజయమ్మ ప్రసంగం అనంతరం షర్మిల మాట్లాడారు. పల్లె పల్లె నుంచి వచ్చిన ప్రతి వైఎస్‌ఆర్‌ అభిమానికి నమస్కరిస్తున్నా అని తెలిపారు.

రాజన్న బాటలో నడిచేందుకు రాజకీయాల్లో తాను తొలి అడుగు వేస్తున్నట్లు చెప్పారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి రావాలని సంకల్పిస్తున్నట్లు  ఆమె పేర్కొన్నారు. 18 ఏళ్ల కిందట మహానేత వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం పేరిట ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు.  అందుకనే ప్రజా ప్రస్థానం మొదలైన ఏప్రిల్‌ 9 న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తున్నానని షర్మిల చెప్పారు. ప్రశ్నించడానికి, పాలకవర్గాన్ని నిలదీయడానికి  పార్టీ అవసరమని ఆమె ఉద్ఘాటించారు. 

ప్రతి రైతు రాజు కావాలని కోరుకున్న నాయకుడు వైఎస్‌ఆర్‌‌‌ అని షర్మిల తెలిపారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఆలోచన చేసింది వైఎస్‌ఆర్‌ అని గుర్తుచేశారు. కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని జలయజ్ఞానికి వైఎస్‌ఆర్‌ శ్రీకారం చుట్టారని, వ్యవసాయాన్ని పండగ చేయాలని వైఎస్‌ఆర్‌ కోరుకున్నారని గుర్తుచేశారు. మహిళలు లక్షాధికారులు కావాలని ఆయన కలలు కన్నారు అని షర్మిల తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top