Foreign Tour-Hyderabad: టూర్‌లకు డిమాండ్‌.. హైదరాబాద్‌ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్‌కు

Hyderabad People Much Intrested To Go europe Trip Switzerland Dubai - Sakshi

ఒక్క టూర్‌లోనే ప్రధాన నగరాల పర్యటన 

సాక్షి, హైదరాబాద్‌: వేసవి టూర్‌లకు డిమాండ్‌ పెరిగింది. సాధారణంగా వేసవి సెలవుల్లో దుబాయ్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపే నగరవాసులు ఈ ఏడాది యూరప్‌కు ఎక్కువగా తరలి వెళ్తున్నారు. గత రెండు నెలలుగా హైదరాబాద్‌ నుంచి యూరప్‌ దేశాలకు వెళ్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు పర్యాటక సంస్థల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ రాకపోకలు ఈ సారి గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి పలు  దేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో నగరవాసులకు ఊరట లభించింది.

వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకుల రద్దీ పెరగడంతో టూర్‌ ఆపరేటర్లు, పర్యాటకసంస్థలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్తున్న పర్యాటకులు అక్కడి నుంచి పారిస్, స్విట్జర్లాండ్, వెనీస్, ఆస్ట్రియా, ఇటలీ, జర్మనీ, తదితర దేశాలను సందర్శిస్తున్నారు. ఒకే పాస్‌పోర్టుపైన ఎక్కువ దేశాల్లో పర్యటించేందుకు అవకాశం లభించడం వల్ల  కూడా నగరవాసులు యూరప్‌కే  ప్రాధాన్యతనిస్తున్నారు.

అద్భుతమైన  పర్యాటక నగరంగా పేరొందిన పారిస్‌కు ఈ ఏడాది అనూహ్యమైన డిమాండ్‌ ఉన్నట్లు టూర్‌ ఆపరేట్లు చెబుతున్నారు. మరోవైపు ఇటలీలోని పురాతన నగరాలు, చారిత్రక కట్టడాలను సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ‘పర్యాటకుల డిమాండ్‌ పెరగడంతో వీసాలు లభించడం కూడా కష్టంగా మారింది. కనీసం నెల రోజులు ముందే స్లాట్‌ బుక్‌ చేసుకొవలసి వస్తుంది.’ అని  ప్రముఖ సంస్థకు చెందిన నిర్వాహకులు ఒకరు తెలిపారు.  
చదవండి: Photo Feature: సినిమా చూపిస్త మామా! 

చార్జీలకు రెక్కలు... 
రెండేళ్ల నష్టాలను పూడ్చుకొనేందుకు ఎయిర్‌లైన్స్‌ బారులు తీరాయి. కోవిడ్‌ నిబంధనల సడలింపుతో  మొదట పరిమితంగా సర్వీసులను ఏర్పాటు చేసిన సంస్థలు క్రమంగా వివిధ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులను పెంచాయి. ప్రయాణికుల రద్దీ పెరగడంతో విమాన చార్జీలకు సైతం రెక్కలొచ్చాయి. యూరప్‌ దేశాలకు సర్వీసులను నడుపుతున్న పలు ఎయిర్‌లైన్స్‌ 20 శాతం నుంచి 22 శాతం వరకు చార్జీలు పెంచాయి.అలాగే హోటళ్లు, స్థానిక రవాణా చార్జీలు కూడా కోవిడ్‌ అనంతరం పెరిగాయి. దీంతో నగరానికి చెందిన టూర్‌ ఆపరేటర్లు సైతం ప్యాకేజీ చార్జీలను అమాంతంగా పెంచారు. గతంలో రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ప్యాకేజీ ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1.5 లక్షల వరకు పెరిగింది. కోవిడ్‌ అనంతరం అన్ని ధరలు పెరగడమే ఇందుకు కారణమని ప్రముఖ పర్యాటక సంస్థ  నిర్వాహకులు అన్సారీ పేర్కొన్నారు.  

నకిలీ ఏజెంట్‌లను నమ్మొద్దు  
టూర్‌ ప్యాకేజీల ఎంపిక సమయంలో  జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌లో కనిపించే ప్యాకేజీలను నమ్మరాదు. తెలిసిన సంస్థల వద్దకు స్వయంగా వెళ్లి అన్ని వివరాలు తెలుసుకొని సంతృప్తి చెందిన తరువాత మాత్రమే  ప్యాకేజీలు బుక్‌ చేసుకోవాలి.  
– వాల్మీకి హరికిషన్, ప్రముఖ టూర్‌ ఆపరేటర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top