సీఎస్ రామకృష్ణారావు సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేస్తున్న హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ప్రతినిధి కేవీబీ రెడ్డి
ఎల్ అండ్ టీతో పూర్తయిన ఒప్పందం
రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ
రూ.13,538.53 కోట్ల అప్పు రీఫైనాన్స్‌కు సర్కారు అంగీకారం
మెరుగ్గా మెట్రో విస్తరణ పనులు, ప్రణాళిక, సేవలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) లిమిటెడ్ అధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) తెలంగాణ ప్రభుత్వం స్వాదీనంలోకి వచ్చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రో సర్కారీ మెట్రోగా మారింది. హెచ్‌ఎంఆర్‌ఎల్ ఫేజ్–1ను స్వాధీనం చేసుకోవాలని గతంలోనే నిర్ణయించిన ప్రభుత్వం.. ఎల్‌అండ్‌టీతో కొద్దిరోజులుగా సంప్రదింపులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈమేరకు ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్)తో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్‌ఎంఆర్‌ఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్‌అండ్‌టీ తరఫున డీకే సేన్, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌అండ్‌టీ హామీతో ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌పై ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును (ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి) తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను సరఫ్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ అందించింది. ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎల్‌అండ్‌టీ చైర్మన్, ఎండీ ఎస్‌ఎన్. సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి.
ప్రయాణికులకు అనుకూలంగా..
ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ సంస్థ 2017, నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కి.మీ. నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్– ఐను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్– ఐను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోవడంతో ఫేజ్–1, ప్రతిపాదిత ఫేజ్–2 నెట్‌వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. భవిష్యత్‌లోనూ హైదరాబాద్ నగరానికి మరింత సమగ్ర, ఆధారపడదగిన, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.


