GHMC Sanitation: పేరు గొప్ప.. ఊరు దిబ్బ

Hyderabad Mayor Sanitation Inspection: Nimboliadda Sanitary Field Assistant Dismissed - Sakshi

స్వచ్ఛ ర్యాంకింగ్స్‌ కోసం తాపత్రయం

వాస్తవ పరిస్థితులు అధ్వాన్నం

మేయర్‌ తనిఖీల్లో వెల్లడవుతున్న బల్దియా తీరు

చర్యలు ప్రారంభం.. విధుల్లో నిర్లక్ష్యానికి ఎస్‌ఎఫ్‌ఏ తొలగింపు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతియేటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్స్‌ కోసం తాపత్రయ పడే జీహెచ్‌ఎంసీలో వాస్తవ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. వరుసగా మూడో రోజు ఆకస్మిక తనిఖీల్లోనూ మేయర్‌కు పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు, అధ్వాన్నపు పారిశుధ్య పరిస్థితులు దర్శనమిచ్చాయి. చెత్త తీసుకువెళ్లేందుకు స్వచ్ఛ ఆటోల వాళ్లు రావడం లేదని పలు ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేశారు. తమ ప్రాంతాల్లో పారిశుధ్యం జరగడం లేదని నింబోలిఅడ్డాలోని ప్రజలు మేయర్‌ దృష్టికి తేగా, సంబంధిత ఎస్‌ఎఫ్‌ఏ (శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌)ను తొలగించాలని ఆదేశించడంతో అందుకనుగుణంగా సికింద్రాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకున్నారు. 

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో.. మేయర్ గద్వాల విజయలక్ష్మి‌ క్షేత్రస్థాయి పర్యటనలతో చెత్త సమస్యలపై ఇప్పుడు దృష్టి సారించినప్పటికీ, జీహెచ్‌ఎంసీ ఈ అంశాన్ని ఎంతోకాలంగా వదిలేసింది. క్షేత్రస్థాయిలో ఈ పనులు నిర్వహించాల్సిన డీసీలు, ఏఎంఓహెచ్‌లు, ఎస్‌ఎఫ్‌ఏలపై  జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి పట్టు లేకుండా పోయింది. దాంతో ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. పేరుకు బయోమెట్రిక్‌ హాజరైనప్పటికీ, ఏ ఒక్కరోజు కూడా పారిశుధ్య సిబ్బంది టీమ్స్‌లోని సభ్యులందరూ హాజరు కారు. ఇవన్నీ పైస్థాయిలోని వారికి తెలియక కాదు. తెలిసినా పట్టించుకోలేదు. కేవలం స్వచ్ఛ ర్యాంకింగ్స్‌ కోసం.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందాలు నగరానికి తనిఖీలకు వచ్చినప్పుడు హడావుడి చర్యలతో వారిని ఆకట్టుకునే పనులు చేస్తున్నారు.

 
అంతేకాదు.. పౌరస్పందన విభాగంలో మార్కులు పొందేందుకు ప్రజల బదులు జీహెచ్‌ఎంసీ సిబ్బందే, అసలు విధులు పక్కనపెట్టి ఫీడ్‌బ్యాక్‌ పంపించారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ర్యాంకుల సర్టిఫికెట్లపై చూపే మోజులో నాలుగోవంతైనా వాస్తవ పరిస్థితులపై దృష్టి సారిస్తే ప్రజలకు చెత్త సమస్యలు తప్పుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేసినా ఉన్నతస్థాయిలోని యంత్రాంగం పట్టించుకోకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

ఇక్కడ చదవండి:
అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో.. వెళ్లిపోతాం సారు

హైదరాబాద్‌ సిటీ బస్సులు తిరిగేది ఇక ఈ సమయంలోనే!‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top