అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో.. వెళ్లిపోతాం సారు

Hyderabad: Migrant Workers Returned Native Place Lockdown Corona - Sakshi

నైట్‌ కర్ఫ్యూతో అప్రమత్తమైన వలస కూలీలు  

రానున్న రోజుల్లో పరిస్థితులపై ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: అవే రోజులు.. అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని అనిశ్చితి.. ఊరు కాని ఊరిలో ఉండటం కంటే సొంతూరికి పోయి బలుసాకు తినైనా బతకొచ్చనే ధీమాతో నగరంలోని వలసజీవులు మరోసారి పల్లెబాట పడుతున్నారు. సొంతూళ్లకు పయనమవుతున్నారు. లారీ, బస్సు, రైలు, కారు, క్యాబ్‌.. ఏదో ఒకటి దొరికిందాంట్లో బతుకు జీవుడా అంటూ బయలుదేరుతున్నారు. మహమ్మారి మహోగ్ర రూపం దాల్చిన  ప్రస్తుత తరుణంలో వైరస్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం ‘నైట్‌ కర్ఫ్యూ’తో కట్టడి విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు జనం బారులుదీరుతున్నారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లు, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ వాహనాల యజమానులు చార్జీల  రెట్టింపుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. 

ఏ క్షణంలో.. ఏం జరుగుతుందో..
►  గత ఏడాది మార్చి, ఏప్రిల్‌  నెలల్లోనే జనం ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. ఆకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో రైళ్లు, బస్సు లతో పాటు  ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది.  గత్యంతరం లేక వలస కూలీలు వందలకొద్దీ కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లారు. 
►  తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, బిహార్, ఉత్తర ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల వలస కూలీలు ప్రాణాలకు తెగించి భార్యా పిల్లలతో మహాపాద యాత్రలు చేశారు. ఈ క్రమంలో కొందరు అసువులు బాశారు. ఆకలి దప్పుల కోసం అలమటించారు. 
►  ఈ ఏడాది మరోసారి అలాంటి చేదు అనుభవాలకు గురి కావొద్దనే ఉద్దేశంతోనే చాలా మంది సొంత ఊళ్ల వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా కోవిడ్‌ ఉద్ధృతి పెరగడంతో పాటు తాజాగా విధించిన రాత్రిపూట కర్ఫ్యూ అందుకు దోహదం చేస్తున్నాయి. 

►  లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత నగరానికి చేరుకొన్న లక్షలాది మంది కొద్ది నెలల్లోనే తిరిగి  సొంత ఊళ్లకు తరలి వెళ్లేందుకు సన్నద్ధం కావడం గమనార్హం. మరోవైపు  ఇప్పటికే ముంబై, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో  లాక్‌డౌన్‌ విధించడంతోనూ రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోననే ఆందోళతో పయనమవుతున్నారు.
ఇళ్లకు చేరేదెలా?

►  ఒకవైపు సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి ఇలా ఉండగా.. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు రాత్రి 9 దాటితే ఇళ్లకు చేరుకోవడం కష్టంగానే  కనిపిస్తోంది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ మొదలు కానుంది. అదే సమయానికి సిటీ బస్సులు విధులు ముగించుకొని డిపోలకు చేరుకొనేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు  రూపొందించారు. మరోవైపు మెట్రో రైళ్లు కూడా నిలిచిపోనున్నాయి. క్యాబ్‌లు, ఆటోలు కూడా ఆగిపోనున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో సిటీకి వచ్చేవారు  గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగా మారనుంది.  

( చదవండి: నెగెటివ్‌గా తేలినా మళ్లీ టెస్టు బెటర్‌: నిపుణులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top