
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో నాలాలు, కాలువల్లో పడి ప్రాణాపాయాలు వంటి ఘటనలు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను హెచ్చరించారు. వర్షాకాల సమస్యలు, ఎస్‌ఎన్‌డీపీ పనులు తదితర అంశాలపై జీహెచ్‌ఎంసీ, తదితర విభాగాల ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వివరాలు.. ‘వర్షాకాలానికి సంబంధించి ఎదురయ్యేసమస్యలపై అప్రమత్తంగా ఉండాలి. రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనలు పునరావృతం కావద్దు. పనులపై ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు.
అన్ని నాలాల్లో వరద నీరు సాఫీగా సాగేలా ఏర్పాట్లుండాలి. పనులు పురోగతిలో ఉండి పూర్తికానప్పటికీ, నీరు పారేలా తగిన ఏర్పాట్లు చేయాలి. పనులు జరిగే ప్రాంతాల్లో బారికేడింగ్‌లు, ప్రమాదహెచ్చరికలు తప్పనిసరి. ప్రజలే కాదు.. పనిచేసే కార్మికుల భద్రతకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికీ అపాయం జరగరాదు. శిథిలభవనాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకర భవనాల్లోని వారిని తరలించాలి. అన్ని జోన్లలోనూ కంట్రోల్‌రూమ్స్ ఏర్పాటు చేయాలి. అంటువ్యాధులు ప్రబలకుండా నివారణచర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
వీడని వాన కష్టాలు
నైరుతి రుతు పవనాల విస్తరణ, ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం సైతం నగరంలో పలు ప్రాంతాల్లో జడివాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు, నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీల్లో వర్షం బీభత్సం సృష్టించింది. మోకాళ్ల లోతున పోటెత్తిన వరద, మురుగు నీటితో పలు బస్తీల వాసులు అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు కష్టాలు పడ్డారు. ఉదయం, సాయంత్రం వేళ కురిసిన వర్షంతో పలు ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
చదవండి: ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు