హైదరాబాద్‌లో తగ్గుతున్న సామాన్య, మధ్యతరగతి గృహ నిర్మాణాలు
అఫర్డబుల్ హౌసింగ్ 70% తగ్గిందంటున్న నివేదికలు
1, 2 బీహెచ్‌కే ఫ్లాట్లు క్రమంగా కనుమరుగు
గిట్టుబాటు కాకపోవడంతో నిర్మాణాలు చేపట్టని బిల్డర్లు
భూములు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలే కారణం
కరోనా పరిస్థితులతో కొనుగోలుదారుల ఆలోచనలోనూ మార్పు
3 బీహెచ్‌కే వంటి విశాలమైన ఇళ్ల వైపు మొగ్గు
2018లో గృహ విక్రయాలలో సామాన్య, మధ్య తరగతి ఇళ్ల వాటా 54 శాతం
ఇప్పుడది 26 శాతానికి పడిపోయిన వైనం.. మొత్తంగా నగరంలో అంతంత మాత్రంగానే స్థిరాస్తి రంగం
భాగ్యనగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. చిన్న ఫ్లాట్ల నిర్మాణం క్రమంగా తగ్గిపోతుండటమే ఇందుకు కారణం. సొంత స్థలంలో ఇల్లు అనేది దశాబ్దాలుగా నగరంలో ఉంటున్న వారికి మినహా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలోనే అపార్ట్‌మెంట్ల కల్చర్ వచ్చింది.
తొలినాళ్లలో ఎక్కువగా సింగిల్ బెడ్ రూమ్ (1 బీహెచ్‌కే), డబుల్ బెడ్ రూమ్ (2 బీహెచ్‌కే) ఇళ్లే ఎక్కువగా నిర్మించేవారు. దీంతో సొంతంగా స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మించుకోలేని వారు అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల వైపు మొగ్గు చూపేవారు. 600–700 చ.అడుగుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉండేవి. సొంతిల్లు కావాలనుకునే వారు ఈ సింగిల్ లేదా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కొనుగోలు చేసి కల నెరవేర్చుకునేవారు. దాదాపు ఐదేళ్ల క్రితం వరకు కూడా డెవలపర్లు ఈ 1, 2 బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.
1, 2 బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. 1 బీహెచ్‌కే ఇళ్లయితే అసలు కనిపించడమే లేదు. మిగతా నగరాలతో పోల్చుకుంటే అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఈ తరహా ఇళ్లు (అఫర్డబుల్ హౌసింగ్/సామాన్యులకు అందుబాటులో ఉండేవి) 70 శాతం తగ్గినట్లు ప్రాప్ ఈక్విటీ నివేదిక పేర్కొనడం గమనార్హం. నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం, లేబర్ల జీత భత్యాలు పెరగడంతో గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో బిల్డర్లు అఫర్డబుల్ హౌసింగ్‌ను దాదాపుగా మానుకుంటున్నారు. మరోవైపు కొనుగోలుదారులు చాలావరకు అవసరమైతే మరింత అప్పు చేసైనా సరే కాస్త విశాలమైన ఇళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లు, విల్లాల వంటివి గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత గణనీయమైన మార్పు చోటు చేసుకుంది.
కరోనా తర్వాత..
కరోనా కాలంలో చిన్న, ఇరుకైన ఇళ్లలో నివసించడం ఎంత రిస్కో తెలిసొచ్చింది. ఎక్కువ గదుల భావన బలపడింది. దీంతో అప్పటినుంచి అత్యధిక శాతం కొనుగోలుదారులు విశాలమైన ఇళ్ల కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 25–40 శాతం భూమి ధరలదే ఉంటోంది. దీంతో లాభదాయకం కాదనే భావనతో బిల్డర్లు కూడా 1, 2 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాన్ని తగ్గించారు. 2018లో గృహ విక్రయాలలో మధ్య తరగతి ఇళ్ల వాటా 54 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 26 శాతానికి పడిపోవడం గమనార్హం.
మధ్య తరగతి గృహాలపై తీవ్ర ప్రభావం..
దేశంలోని ఇతర మెట్రో నగరాలలో కూడా అఫర్డబుల్ గృహాల నిర్మాణం వేగంగా తగ్గుతోంది. ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం మన తర్వాత (70 శాతం) ముంబైలో 60 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 50 శాతం మేర క్షీణించాయి. ప్రత్యేకించి హైదరాబాద్‌లో 2022 నుంచి రూ.కోటి కంటే బాగా తక్కువగానే ధర ఉండే మధ్య తరగతి గృహ నిర్మాణాల అమ్మకాలు భారీగా తగ్గాయి. విశాలమైన, విలాసవంతమైన ఇళ్లలో నివాసం ఉండేందుకు, కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుండటంతో వారి అభిరుచులకు మేరకు డెవలపర్లు కూడా లగ్జరీ గృహ నిర్మాణాలకు మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు భూముల ధరలు ఆకాశాన్నంటడం, నిర్మాణ సామగ్రి, నైపుణ్య కారి్మకుల వేతనాలు పెరగడం వంటి కారణంగా మధ్య తరగతి ఇళ్ల నిర్మాణం బిల్డర్లకు లాభసాటిగా ఉండటం లేదు. దీంతో ఎక్కువ లాభదాయకంగా ఉండే ప్రీమియం ప్రాజెక్టుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ధరలు పెరిగే అవకాశం
టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ అత్యంత కీలకం. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు.
కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్‌లు, శానిటరీ వేర్ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు తుదిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయక తప్పదు. ఫలితంగా అపార్ట్‌మెంట్ల ధరలను చ.అ.కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తగ్గుతున్న అమ్మకాలు
భూములు, నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడం, నైపుణ్య కారి్మకుల కొరత, గృహ రుణ వడ్డీ రేట్ల పెరుగుదల సూచనలు.. వెరసి హైదరాబాద్ స్థిరాస్తి రంగం కుప్పకూలుతోంది. 2024తో పోల్చుకుంటే 2025లో ప్రాజెక్టులు, అదే విధంగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఇక హైదరాబాద్‌లో 2025 చివరి త్రైమాసికంలో 60 లక్షల చదరపు అడుగులు (చ.అ.) మేర గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి కేవలం 6 లక్షల చ.అ.లకే పరిమితయ్యాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారీ స్థాయిలో క్షీణించడం నగరలో నిర్మాణ రంగ పతనాన్ని సూచిస్తోంది. ఇంకోవైపు కనెక్టివిటీ, మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో శివారుప్రాంతాల్లోని 40 శాతం మధ్య తరగతి గృహాలు అమ్ముడుపోకుండా ఉన్నాయి.

ప్రభుత్వం చొరవ చూపాలి
భూ యజమానులు అత్యాశతో భూముల ధరలను రాత్రికి రాత్రే పెంచేస్తున్నారు. దీంతో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లు చేపట్టాలంటే బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. ఓఆర్‌ఆర్ చుట్టూ భూముల లభ్యత విపరీతంగా ఉంది. అయితే సరైన మౌలిక వసతుల్లేవు. ఆ మేరకు ప్రభుత్వం సదుపాయాలు కలి్పస్తే మధ్య తరగతి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుంటుంది.
– నరేంద్రకుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ (ఫొటో కామన్‌లో నరేంద్ర కుమార్ పేరుతో ఉంది)


