కాషాయ గూటికి చేరిన ఈటల.. మిగిలింది ఉప ఎన్నికే!

Huzurabad: Eatala Rajender To Join BJP Remaining Only By Election - Sakshi

ఢిల్లీలో బీజేపీ చీఫ్‌ నడ్డాతో మాజీ మంత్రి భేటీ

త్వరలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా

అధికారికంగా బీజేపీలో చేరడమే తరువాయి

టీఆర్‌ఎస్‌ ‘ఆపరేషన్‌.. హుజూరాబాద్‌’ వేగం

 చక్రం తిప్పుతున్న గంగుల, హరీశ్‌రావు, వినోద్‌

గులాబీ టికెట్టు కోసం మొదలైన పైరవీలు

సాక్షి, కరీంనగర్‌: నెలరోజుల ఉత్కంఠకు దాదాపుగా తెరపడింది. భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఊహించిన విధంగానే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ చీఫ్‌ జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, మాజీ ఎంపీ జి.వివేక్‌ సమక్షంలో బీజేపీ చీఫ్‌ను కలిసిన ఈటల.. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌లో చోటు చేసుకున్న పరిణా మాలు, తాను బీజేపీలో చేరేందుకు ప్రేరేపించిన పరిస్థితులను వివరించినట్లు తెలిసంది. ఢిల్లీ నుంచి హుజూరాబాద్‌కు వచ్చిన తరువాత ఈటల తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. రాజీనామా అనంతరమే అధికారికంగా బీజేపీలో చేరనున్నారు.

ఊగిసలాట నడుమ కాషాయం వైపు
మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ ఈటల రాజేందర్‌ రాజకీయ భవితవ్యంపై నెలరోజులుగా ఊహాగానాలు సాగాయి. టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే నాయకులతో కలిసి పార్టీ పెడతారని, బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏదో ఓ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి అనుగుణంగా ఆయన పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిశారు. అదే సమయంలో వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తారని, ఇప్పట్లో రాజీనామా చేయరని విశ్లేషణలు సాగాయి. అయితే.. ఈటల రాజేందర్‌పై అధికార టీఆర్‌ఎస్‌ నుంచి ముప్పేట దాడి మొదలైంది. స్థానికంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల వర్గీయులందరినీ టీఆర్‌ఎస్‌ తనవైపు లాక్కుంది.

జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ ‘ఆపరేషన్‌ హుజూరాబాద్‌’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజాప్రతినిధులు ఈటల వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు భూకబ్జాల ఆరోపణలపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఈటల ఆలస్యం చేయకుండా భవిష్యత్తులో తనకు రాజకీయంగా మైలేజీ ఇవ్వగలదని భావించిన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరే విషయంలో కొంత ఊగిసలాట ధోరణితో వ్యవహరించినా, ఆ పార్టీ తప్ప ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డాను కలవడంతో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైంది. 

చదవండి: ఈటల.. ఒంటరిగానే..!..పావులు కదుపుతోన్న టీఆర్‌ఎస్‌ !

తప్పని ఉప ఎన్నిక!
బీజేపీలో చేరడానికి ముందు ఈటల ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది. వారం రోజుల్లో ఈ తంతు కూడా పూర్తి చేస్తారని సమాచారం. రాజీ నామా చేసిన తరువాత బీజేపీలో అట్టహాసంగా చే రాలని భావిస్తున్నా, కోవిడ్‌ కారణంగా కొద్దిమందితోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈటల రాజీ నామా చేసిన ఆరునెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆరునెలల్లో ఉప ఎన్నిక ని ర్వహణకు ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇప్పటికే టీ ఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ ప్రజాప్రతినిధులెవరూ ఈటల వెంట వెళ్లకుండా కట్టడి చేస్తోంది. ఈటల బీజేపీలో చేరడం ఖాయమవడంతో ‘ఆపరేషన్‌ హుజూ రాబాద్‌’ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.


సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, నాయకుడు దొంత రమేశ్‌ 

గంగుల, వినోద్‌ల నేతృత్వంలో..
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ 17 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్‌పై టీఆర్‌ఎస్‌కు పట్టు సడలలేదని చెప్పేందుకు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ త్వరలోనే ఈ నియోజకవర్గంలో తిష్టవేసి కార్యక్రమాలను కొనసాగించనున్నారని సమాచారం. మండలాల వారీగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడం, అయిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయించడంతోపాటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామనే సంకేతాలు పంపించనున్నారు.

ఆదివారం మంత్రివర్గ సమావేశం సందర్భంగా ప్రగతిభవన్‌లో మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌తో హుజూరాబాద్‌ అంశంపై చర్చించినట్లు తెలిసింది. హుజూరాబాద్‌కు చెందిన పార్టీ రాష్ట్ర నాయకుడు, టీటీడీ మాజీ లైజనింగ్‌ అధికారి దొంత రమేశ్‌ కూడా గంగుల, హరీశ్‌తోపాటు సీఎంను కలిశారు. స్థానికంగా హుజూరాబాద్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా వివరించినట్లు దొంత రమేశ్‌ తెలిపారు. మొత్తానికి ఈటల పార్టీ మారనుండడంతో హుజూరాబాద్‌లో రాజకీయాలు వేడెక్కాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top