‘జూబ్లీహిల్స్‌’ ఎన్నికలపై హైకోర్టు స్టే | High Court stays Jubilee Hills elections | Sakshi
Sakshi News home page

‘జూబ్లీహిల్స్‌’ ఎన్నికలపై హైకోర్టు స్టే

Apr 3 2026 4:20 AM | Updated on Apr 3 2026 10:31 AM

High Court stays Jubilee Hills elections

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ సభ్యుడు సునీల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నందా సూరేపల్లి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘2024లో 270 మందికి సభ్యత్వం ఇవ్వడంపై ఈ కోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. పాత వారిని తొలగించడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా సహకార శాఖ రిజి్రస్టార్‌ పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులో పిటిషన్‌ వేయాల్సి వచ్చింది’అని చెప్పారు. 

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ప్రక్రియలో కోర్టులో జోక్యం చేసుకోలేవని సహకార శాఖ తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఓటర్ల జాబితాపై పలు పిటిషన్లు, ధిక్కరణ పిటిషన్లపై ఇదే కోర్టు విచారణ చేపడుతున్నందున జోక్యం చేసుకోవచ్చన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement