ఆ నిధుల విడుదలకు హైకోర్టు ఓకే

High Court: Revocation Of Stay Order On Jivo 208 - Sakshi

జీవో 208’పై స్టే ఉత్తర్వుల ఎత్తివేత

సాక్షి, హైదరాబాద్‌: భూసేకరణలో భాగంగా చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి కోర్టు ధిక్కరణ, ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు దాఖలు చేసినవారికే రూ.59 కోట్లు విడుదల చేస్తూ జీవో 208 జారీ చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు గతంలో ఈ నిధులను విడుదల చేయరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేసింది. నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

కోర్టుధిక్కరణ కేసుల్లో హాజరైనవారి కోసం అంటూ రూ.59 కోట్లను విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన లెక్చరర్‌ సి.ప్రభాకర్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. గతంలో ఆదేశించిన మేరకు జీవోను సవరించి తాజాగా జారీచేశారా అని ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ఈ పిటిషన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ దాఖలు చేసిన కౌంటర్‌లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏజీ నివేదించారు. ఈ నిధులను ఎందుకోసం ఖర్చు చేస్తున్నారో స్పష్టం చేస్తూ సవరించిన జీవో జారీచేయడానికి ఇబ్బంది ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా గత ఏడాది విడుదల చేసిన నిధులు సకాలంలో నిర్వాసిత రైతులకు అందించలేకపోయామని, దీంతో తాజాగా ఈ జీవో జారీచేయాల్సి వచ్చిందని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top