
ఇటు దిగ్బంధం.. అటు అంధకారం.. బుధవారం రాత్రి రామంతాపూర్ పెద్ద చెరువు ప్రాంతంలోని ఓ కాలనీ
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. మూసీ పరీవాహక ప్రాంత బస్తీలు విలవిలలాడాయి. ఈ బస్తీల్లోకి వరద పోటెత్తింది. దీనికితోడు కరెంట్‌లేక అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. హయత్‌నగర్, తట్టి అన్నారం, నిమ్స్, కందికల్ గేట్, పెద్ద అంబర్‌పేట్, కొత్తపేట, రంగారెడ్డి కోర్టు, హనుమాన్‌నగర్, ఎంజీబీఎస్, అత్తాపూర్ తదితర 33 కేవీ సబ్‌స్టేషన్లను వరదనీరు ముంచెత్తింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో 686 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. 59 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 312 విద్యుత్ స్తంభాలు నెలకూలాయి. దీంతో ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం రాత్రి వరకు 35 ఫీడర్లు, 63 విద్యుత్ స్తంభాలు మినహా మిగిలినవాటిని పునరుద్ధరించినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రకటించింది. అయితే రోడ్‌సైడ్ బ్రేకర్లలోకి వరద చేరడంతో ఆన్ చేసిన వెంటనే సుమారు 200పైగా ఫీడర్లు మళ్లీ ట్రిప్పయ్యాయి. ఫలితంగా ఆయా ఫీడర్ల పరిధిలోని వినియోగదారులకు రెండోరోజు కూడా అంధకారం తప్పలేదు. చార్జింగ్ లేక సెల్‌ఫోన్లు కూడా మూగబోయాయి.
ఇప్పటికీ అంధకారంలోనే ఆ కాలనీలు
►బంజారాహిల్స్‌లోని ఫిలింనగర్, ఎన్బీటీ నగర్, ఎమ్మెల్యే కాలనీ, కమలాపురి కాలనీ, ఇందిరానగర్, పంజగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, చింతల్‌బస్తీలకు ఇప్పటివరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. జూబ్లీహిల్స్ రహమత్‌నగర్ డివిజన్‌లోనూ కరెంటు సరఫరా లేదు.
►ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం డివిజన్ కోదండరామ్‌నగర్, పీఎన్‌టీ కాలనీ, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లోని హరిహరపురం, ఎస్‌కేడీ నగర్ పార్ట్, గాంధీనగర్, హయత్‌నగర్ డివిజన్‌లోని రాఘవేంద్రనగర్, పద్మావతీనగర్, బంజారాకాలనీ, అంబేడ్కర్‌నగర్, రంగనాయకులగుట్ట కాలనీలో విద్యుత్ సరఫరా లేదు.
►హుస్సేన్ సాగర్ నాలాను ఆనుకుని ఉన్న నల్లకుంట డివిజన్ రత్నానగర్, సత్యానగర్‌లలోకి వరద నీరు భారీగా చేరడంతో ఆయా బస్తీలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
►ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గూడెం చెరువు, పర్వతాపూర్ చెరువు తెగి చెరువుల కింద ఉన్న రామకృష్ణనగర్, కృష్ణానగర్, బాలాజీనగర్, ఆదర్శనగర్, సాయికృష్ణనగర్ తదితర ప్రాంతాలు పూర్తిగా జల మయమవడంతో ఆయా కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో మగ్గాల్సి వచ్చింది.