హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ | Heavy Rain Lashes Hyderabad: Waterlogging Disrupts Traffic | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Aug 7 2025 6:48 PM | Updated on Aug 7 2025 9:52 PM

Heavy Rain Lashes Hyderabad: Waterlogging Disrupts Traffic

Hyderabad Rains Updates:

👉జంట జలాశయాల్లోకి  భారీగా వరద

  • కాసేపట్లో హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తనున్న అధికారులు
  • లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • కిస్మత్‌పూర్‌, బండ్లగూడ, సన్‌సిటీ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల సూచన
  • వరద నీటిలో మునిగిన ఖైరతాబాద్‌-రాజ్‌భవన్‌ రహదారి
  • మోండా మార్కెట్‌, బండిమెట్‌లో భారీగా వరద
  • జీడిమెట్ల, సుచిత్రలో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా
  • బేగంబజార్‌, గౌలిగూడ బస్తీల్లో భారీగా నిలిచిన వరద
  • భారీ వర్షానికి మణికొండలో కారుపై కూలిన గోడ
  • యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో భారీగా వరద ప్రవాహం
  • భారీ వర్షానికి మాదాపూర్‌లో  పొంగుతున్న డ్రైనేజీ

👉నగరంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం మెుదలైంది. అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, మూసాపేట్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్‌,  జూబ్లీహిల్స్‌, మెహదీపట్నం, మణికొండ, మియాపూర్, చందానగర్‌, బాలానగర్ సనత్‌ నగర్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్..

..అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్ద అంబర్‌పేట్. దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌ నగర్, నాచారం తార్నాక, నల్లకుంట హబ్సిగూడ, బేగంపేట్, వారణాసిగూడ, కంటోన్మెంట్, మారేడుపల్లి, హియాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

👉హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.

👉జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

👉నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు, ఎస్‌ఆర్‌ నగర్‌ 11, ఖైరతాబాద్‌ 11, సరూర్‌నగర్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఒక వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చాదర్‌ఘాట్‌ నుండి ఎల్‌బీ నగర్‌ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

👉ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు వచ్చే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్‌ కష్టాలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షాల దాటికి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరువు, ఖైరతాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి, మెహదీపట్నం, గోల్కొండ, కాప్రా, సికింద్రాబాద్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ముందుగానే తెలంగాణ వెదర్‌మ్యాన్‌ హెచ్చరించాడు. కొన్ని ప్రాంతాల్లో 2.5-4 సెం.మీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

👉కేబుల్‌ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మాదాపూర్‌, కొండాపూర్‌ బయోడైవర్శిటీలో భారీ ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా  వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

👉బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. నల్లగొండ, యాదాద్రి, నాగర్‌ కర్నూలు, వనపర్తి జిల్లాలో అక్కడక్కడా  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ముందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

HYD Rains: హైదరాబాద్ లో వర్ష బీభత్సం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement