తదుపరి 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం
రానున్న నాలుగు రోజులకు ఎల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది క్రమంగా పశ్చిమ దిశలో కదిలి శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం మరింత బలపడి ఆదివారం ఉదయంకల్లా తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
తదుపరి 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం బలపడి సోమవారం నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం తుపాను మరింత బలపడి ఈనెల 28వ తేదీనాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తీవ్ర తుపాన్ ఉత్తర వాయవ్య దిశలో కదులుతూ కాకినాడకు సమీపంలో 28వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుపానుగా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు..
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తదుపరి తుపాను ప్రభావం రాష్ట్రంపైన మధ్యస్తంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేసింది. రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చని చెబుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


