ఇక ఉచితంగా బాలల గుండె శస్త్ర చికిత్సలు

Harish Rao Inaugurates Sathya Sai Trust Child Heart Care Centre in Siddipet - Sakshi

సత్యసాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో పరిశోధనాస్పత్రి

ప్రారంభించిన మంత్రి హరీశ్‌

రూ.50 కోట్లతో 100 పడకలు 

అధునాతన టెక్నాలజీతో కొండపాక శివారులో ఏర్పాటు

ఈ నెల 23 నుంచి సేవలు

కొండపాక(గజ్వేల్‌): ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు అందించేందుకు నెలకొల్పిన బాలల శస్త్ర చికిత్స పరిశోధనాస్పత్రి అపర సంజీవనిగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులోని ఆనంద నిలయం ఆవరణలో సత్యసాయి సేవాసంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రిని సత్యసాయి ట్రస్టు నిర్వహణ ప్రతినిధి సద్గురు మధుసూదన్‌సాయితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వందమంది పిల్లల్లో ఒకరు గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకోవడం కంటే సత్యసాయి ఆస్పత్రిలో చికిత్స పొందేలా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రూ.50 కోట్లతో 100 పడకలు, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆస్పత్రి ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. సత్యసాయి ట్రస్టు నిర్వహణ ప్రతినిధి సద్గురు మధుసూదన్‌సాయి మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామీణ ప్రాంత పేద పిల్లలకు వైద్యాలయం ద్వారా గుండె శస్త్ర చికిత్సలను ఉచితంగా అందజేస్తామన్నారు. నవంబరు 23 రోజున సత్యసాయి బాబాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైద్యాలయ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి, ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్, సిద్దిపేట జెడ్పీ చైర్‌ పర్సన్‌ వేలేటి రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top