గల్ఫ్ బాధితులను ఆప్యాయంగా పలకరిస్తున్న హరీశ్‌రావు
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
ప్రవాస తెలంగాణ వాసులకు ఇచ్చిన హామీల అమలేదీ?
జోర్డాన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ కార్మికులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బతుకుదెరువు కోసం అప్పులు చేసి జోర్డాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు ఏజెంట్ల చేతుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడే చిక్కుకు పోయిన 12 మంది వలస కార్మికులు హరీశ్‌రావు చొరవతో శనివారం తెల్లవారు జామున హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో వారు హరీశ్‌రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జోర్డాన్‌లో అనేక కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకుని, స్వదేశానికి చేర్చేందుకు చొరవ తీసుకున్నందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రవాస తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం ఒక్క హామీనీ నెరవేర్చలేదు.
రాష్ట్రం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి విదేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలి’అని డిమాండ్ చేశారు. జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులపై విధించిన జరిమానా కూడా చెల్లించి వారిని స్వదేశానికి తీసుకువచ్చాం అని హరీశ్‌రావు వెల్లడించారు. హరీశ్‌రావుతో భేటీ తర్వాత వారు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లారు.


