Sakshi News home page

తెలంగాణ గృహలక్ష్మీ: సిలిండర్‌కు ముందుగా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే!

Published Sat, Feb 24 2024 2:52 AM

Gruha Lakshmi Scheme: Beneficiaries have to pay the full amount at the time of the cylinder delivery - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేసిన విధంగానే  గృహలక్ష్మి పథకం(రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌) కింద ఎంపికైన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో రీయింబర్స్‌ చేయనుంది. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (ఓఎంసీ)లకు అందజేస్తే, సిలిండర్‌ రీఫిల్‌ సమయంలో లబ్ధిదారులు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత.. ఆయిల్‌ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్‌ ప్రకారం రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాయి.

అలాగే తెల్ల రేషన్‌కార్డు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. దీనికి నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీని ఆధారంగా లబ్ధిదారు లను గుర్తిస్తారు. అర్హత గల కుటుంబం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. దాని ఆధారంగానే లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇస్తారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, తెల్లరేషన్‌కార్డుల ఆధారంగా ప్రభుత్వం 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది.

వీరు మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా మూడు నుంచి ఐదు సిలిండర్లకు ఈ పథకం వర్తించనుంది. కాగా రాష్ట్రంలో కోటి 20 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, 90 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.300లకు పైగా సబ్సిడీ అందిస్తోంది. ఇప్పుడు వీరిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకురానున్నట్టు సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement