నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌.. వారంలోగా గ్రూప్‌–2 నోటిఫికేషన్‌!

Group-2 Notification May Be Released Next Week In Telangana - Sakshi

700కు పైగా పోస్టులు ఉండే అవకాశం 

టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి 

నెలాఖరులోగా గ్రూప్‌–1 మెయిన్స్‌ సెలక్షన్‌ లిస్ట్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హడావుడి మరింత జోరందుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తుండడంతో నియామక సంస్థలు సైతం ఆ మేరకు వేగాన్ని అందిపుచ్చుకుంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. నియామకాల ప్రక్రియను ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మరో కీలక ప్రకటన విడుదలకు సిద్ధమవుతోంది. గ్రూప్‌–2 కేటగిరీ ఉద్యోగాల భర్తీకి వారం రోజుల్లోనే ప్రకటన విడుదల చేయనుంది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసింది. 

ఈ కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఉద్యోగాలు 582. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే వివిధ  ఉద్యోగ కేటగిరీల మార్పులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్‌–2 కేటగిరీలో అదనపు కేడర్లు చేరాయి. దీంతో పోస్టుల సంఖ్య 700కు పైగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుల స్థాయిలో మార్పులు చేయడం వల్లే గ్రూప్‌–2 ప్రకటన జారీలో కాస్త జాప్యం జరిగినట్లు కమిషన్‌ వర్గాల విశ్వసనీయ సమాచారం.  

పోస్టుల స్థాయి మార్పుతోనే ఆలస్యం 
ఎస్సీ అభివృద్ధి శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని సహాయ సెక్షన్‌ అధికారి పోస్టులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జువైనల్‌ సరీ్వసు జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు గ్రూప్‌–2 కేటగిరీలోకి చేరాయి. ప్రస్తుతం ఈ కేటగిరీల్లోని పోస్టులు 120కి పైగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన పోస్టులకు స్థాయి మార్పుతో జత అయిన పోస్టులన్నీ కలిపి ఒకేసారి ప్రకటన జారీ చేసే క్రమంలో నోటిఫికేషన్‌ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. 

మే లోగా గ్రూప్‌–1 మెయిన్స్‌ 
గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి ఫలితాలను వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ అతి త్వరలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. గ్రూప్‌–1 కేటగిరీలో 503 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదే నెల చివరి వారంలో పరీక్ష కీ విడుదల చేసిన కమిషన్‌.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు వేగవంతం చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. మల్టీజోన్లు, రిజర్వేషన్‌ కేటగిరీల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండడంతో ఈ ప్రక్రియలొ కొంత జాప్యం జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి వారం లేదా పది రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని కమిషన్‌ వర్గాలు యోచిస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top