వాటర్‌.. మరో మీటర్‌.. | Groundwater levels drop to a meter deep in the wake of summer | Sakshi
Sakshi News home page

వాటర్‌.. మరో మీటర్‌..

Apr 5 2026 4:43 AM | Updated on Apr 5 2026 4:43 AM

Groundwater levels drop to a meter deep in the wake of summer

వేసవి నేపథ్యంలో మీటర్‌ లోతుకు  జారిన భూగర్భ జలాలు

ఫిబ్రవరిలో 7.25 మీటర్ల లోతుల్లో జలాల లభ్యత

మార్చి నాటికి 8.22 మీటర్ల లోతుల్లోకి పడిపోయిన జలాలు

10 జిల్లాల్లో ప్రమాదకర స్థాయికి చేరిన వైనం 

రాష్ట్ర భూగర్భ జల శాఖ నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూగర్భ జలాల సగటు మట్టం తీవ్రంగా పడిపోతోంది. నెల రోజుల వ్యవధిలో మీటర్‌కి పైగా లోతుల్లోకి జారిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వేసవి తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో భూగర్భజలాల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రధానంగా బోరుబావుల కింద యాసంగి పంటల సాగుకోసం యథేచ్ఛగా నీటిని తోడేస్తుండటంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో 7.25 మీటర్ల లోతుల్లో లభ్యమైన భూగర్భ జలాలు మార్చి నాటికి 8.22 మీటర్ల లోతుల్లోకి దిగజారాయి. 

కాగా, జనవరిలో 6.28 మీటర్ల లోతుల్లోనే జలాలు లభ్యమయ్యాయి. వాస్తవానికి గత వర్షాకాలంలో సాధారణానికి మించి 37 శాతం వర్షపాతం నమోదు కావడంతో ప్రస్తుత నీటి సంవత్సరం 2025–26లో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర భూగర్భ జలాల సగటు మట్టం 4.41 మీటర్ల లోతుల్లోనే ఉంది. ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో మార్చి నాటికి 8.22 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. 

గతేడాది మార్చిలో రాష్ట్ర భూగర్బ జలాలు 9.91 మీటర్ల లోతుల్లోకి పడిపోగా, ఈ ఏడాది మార్చిలో కొంత మెరుగ్గా 8.22 మీటర్ల లోతుల్లోనే లభ్యమవుతున్నాయి. గత వర్షాకాలంలో సాధారణానికి మించి వర్షాలు కురవడమే దీనికి కారణం. రాష్ట్ర భూగర్భ జల శాఖ ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. 

వికారాబాద్‌లో ఆందోళనకరం..
ఖమ్మం జిల్లాలో 4.52 మీటర్ల లోతుల్లోనే భూగర్భ జలాల లభ్యత ఉండగా, వికారాబాద్‌ జిల్లాలో మాత్రం 13.72 మీటర్ల లోతుల్లో లభిస్తున్నాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా, కేవలం 2 జిల్లాల్లోనే 0–5 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. 

21 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతుల్లో, 10 జిల్లాల్లో 10 మీటర్లకి మించిన లోతుల్లో భూగర్భ జలాలున్నట్టు తేలింది. 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు భావిస్తారు. ఈ నేపథ్యంలో వేసవి ప్రారంభంలోనే 10 జిల్లాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్టు ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి.

వికారాబాద్‌ జిల్లాలో 13.72, కామారెడ్డి జిల్లాలో 12.35 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 11.95 మీటర్లు, మెదక్‌ జిల్లాలో 11.86 మీటర్లు, నిజామాబాద్‌ జిల్లాలో 11.67 మీటర్లు, సిద్దిపేట 11.13 మీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 10.80 మీటర్లు, మేడ్చల్‌ 10.78 మీటర్లు, సిరిసిల్ల 10.6 మీటర్లు, రంగారెడ్డి 10.06 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి.

85 మండలాల్లో దశాబ్దకాలం కంటే లోతుల్లోకి 
రాష్ట్రంలో 536 మండలాల్లో (86శాతం) భూగర్భ జలాల మట్టం గత దశాబ్ద కాల సగటు కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ మండలాల్లో 0.01–19.24 మీటర్ల మేర దశాబ్ద కాల వృద్ధి నమోదైంది. మిగిలిన 85 మండలాల్లో(14శాతం) దశాబ్ద కాల సగటు కంటే 0.01 నుంచి 13.4 మీటర్ల మేరకు లోతుల్లో భూగర్భ జలాలు పడిపోయాయి.

ఎండిపోతున్న పంటలు..
కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు బాగా ఇంకిపోవడంతో బోరుబావుల కింద సాగుచేస్తున్న యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ట్యాంకర్లతో పంటలకు నీళ్లు అందించడానికి తంటాలు పడుతున్నారు. ఎండిపోయిన పంటలను పశువులకు మేత కోసం వదిలేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement