నెలన్నర దాటినా ముమ్మరంగా సాగని కొనుగోళ్ల ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలో కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 54,53,622 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యం వచ్చింది. అందులో ఈ నెల 18వ తేదీ వరకు 39,74,335 ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా మరో 14,79,287 ఎంటీల ధాన్యం కేంద్రాల్లోనే ఉంది. ఇక కొనుగోలు చేసిన ధాన్యంలోనూ 2,87,540 ఎంటీల ధాన్యం మిల్లులకు పంపకుండా కేంద్రాల్లోనే ఉంచారు. అంటే అధికారిక లెక్కల ప్రకారమే 17,66,827 ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది.
ఇక 36,86,795 ఎంటీల ధాన్యం మిల్లులకు వెళ్లినా, అందులో 6,00,143 ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లు దింపుకోలేదు. మొత్తంగా ఇలా 23.66 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కొనుగోళ్లు ప్రారంభమై నెలన్నర దాటిపోయింది. మే నెలాఖరుకల్లా కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవాల్సి ఉంది. అయినా 43.38 శాతం ధాన్యానికి సంబంధించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొనుగోళ్ల వ్యవహారంలో అధికారులు విఫలం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లారీలు రాక మండుటెండలో..
రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో 60 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేయగా, 151 ఎల్‌ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో దాదాపు 40 శాతం మిల్లర్లు నేరుగా కొను గోలు చేసినా, మిగతా 60 శాతం కొనుగోలు కేంద్రాల ద్వారానే కొనాలి. కానీ అందులో కొనుగోలు చేసింది 65 శాతం లోపే. ఇక 8,575 కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ట్రక్కులు, ట్రాక్టర్లు, లారీలు కలిపి 11500 రవాణా వాహనాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
కానీ క్షేత్ర స్థాయిలో అందులో సగం కూడా కనిపించడం లేదు. రాష్ట్ర స్థాయి లో లారీలను సమకూర్చుతామంటూ టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. తమ వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్నొ న్న లారీల్లో సగం కూడా ధాన్యం రవాణాకు సమకూర్చకపోవడంతో రైతులకు తంటాలు తప్పడం లేదు. ఈ విషయంలో అధికార యంత్రాంగం వారికే వంత పాడుతోందనే ఆరోపణలున్నాయి.
లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు రోజు విడిచి రోజు కూడా లారీలు రావడం లేదు. దీంతో రైతులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అకాల వర్షాల భయంతో ఏదోలా అమ్ముకొని ఇంటికి వెళదామంటే సకాలంలో లారీలు రాకపోవడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు.
తాలు పేరుతో అడ్డగోలు దోపిడీ
మరోవైపు కొనుగోలు కేంద్రంలోనే తాలు పేరుతో కిలో, రెండు కిలోలు అదనంగా దోపిడీ చేస్తుండగా, మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దింపుకునేందుకు తాలు పేరుతో కొర్రీలు పెడుతూ నాలుగైదు కిలోలు కోత పెడుతున్నారు. మొత్తం మీద కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ధాన్యం తూకం వేసినందుకు హమాలీలకు కమీషన్ ఇవ్వాల్సి వస్తుండగా, లారీల వారు కూడా రైతులనుంచి బస్తాకు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. అలా డబ్బులు ఇస్తేనే కొనుగోలు కేంద్రానికి లారీలను పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద కష్టపడి ధాన్యం పండించిన రైతులు ఆ ధాన్యం అమ్ముకోవడానికి సైతం నానా కష్టాలూ పడుతూ, నష్టపోవాల్సిన పరిస్థితులు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అడ్డగోలుగా ధాన్యం దోపిడీ
నల్లగొండ జిల్లాలోని ఓ కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని బస్తాకు 40 కిలోల 700 గ్రాముల చొప్పున తూకం వేయాల్సి ఉన్నా, దానిని 42.5 కిలోల చొప్పున తూకం వేసి ఒక్కో బస్తాకు కిలో 800 గ్రాములు దోచుకున్నారు. ఒక లారీలో 1057 బస్తాలు వేస్తే దానిపై 19 క్వింటాళ్లు కోత పెట్టా రు.
ఆ ధాన్యం బస్తాలను మిల్లుకు పంపించగా, సదరు మిల్లర్.. బస్తాకు 40 కిలోల 700 గ్రాముల చొప్పున లెక్కించి 1,038 బస్తాలుగానే పరిగణనలోకి తీసున్నాడు. అంటే ఇక్కడ 19 బస్తాలకు కోత పెట్టారు. అంటే మిల్లులో దాదాపు 7.7 క్వింటాళ్లు కోత పెట్టారు. ఇలా ఒక్క లారీపైనే ఇటు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, అటు మిల్లర్లు కలిసి 26.7 క్వింటాళ్ల వరకు కోత పెట్టి, ఆ రైతుల నుంచి ఏకంగా రూ.63 వేలు దోచుకున్నారు.
లారీలు ఎప్పుడొస్తాయో..
ధాన్యం మార్కెట్‌కు తెచ్చి నెల అవుతోంది. ఇంతవరకు తరలించలేదు. లారీలు రాలేదు. ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో పట్టాలు కప్పి కాపలా ఉండాల్సి వస్తోంది. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. – బోడ హెమ్లా, బిస్రాజుపల్లి తండా, తిరుమలాయపాలెం, ఖమ్మం
కోతకు ఒప్పుకుంటేనే అన్‌లోడ్
నేను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి విక్రయించా. 437 బస్తాలు తూకం వేసి మిల్లుకు పంపించారు. మిల్లర్ క్వింటాలుకు 14 కిలో ల తరుగు అడిగాడు. అడిగినంత తరుగుకు ఒప్పుకుంటేనే బస్తాలు దింపుకుంటాననడంతో ఏం చేయలేక అంగీకరించా. ఇదేం దోపిడీయో అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. – ఏనుగు చిన్న బాల్‌రెడ్డి, మైలారం, ధర్పల్లి, నిజామాబాద్
లారీకి రూ.5 వేలు ఇవ్వాలంట
ధాన్యం ఆరబెట్టి మంగపేట ఎఫ్‌ఎస్‌సీఎస్ సెంటర్‌లో బస్తాలు నింపి కాంటా కోసం సిద్ధంగా ఉంచా. ఇప్పటికి 29 రోజులు కావస్తున్నా నేటికీ కాంటా పెట్టలేదు. లారీకి రూ.5 వేలు ఇస్తే కాంటా పెడతామని చెపుతున్నారు.
– జక్కం నాగేశ్వర్‌రావు, బోరునర్సాపురం, ములుగు


