చతికిల‘బడి’.. కూలిపోయే పైకప్పులు.. వేలాడే విద్యుత్‌ తీగలు! 

Govt Schools Across Telangana Has Dilapidated - Sakshi

బడి గోడుకు మోక్షమెప్పుడు? 

మన ఊరు–మనబడిలో కన్పించని పురోగతి 

12 రకాల పనులతో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం 

ప్రకటనలకే పరిమితం.. వేధిస్తున్న నిధుల కొరత 

తొలిదశలో 9,123 పాఠశాలల ఎంపిక 

7,211 బడుల్లో పనులు మొదలు.. 1,200 చోట్ల మాత్రమే పూర్తి 

చాలాచోట్ల రంగులు, మరమ్మతులు లేవు..కొత్త గదుల ఊసే లేదు 

సాక్షి, హైదరాబాద్‌: కూలిపోయేలా ఉన్న పై కప్పులు.. రాలిపోతున్న గోడల పైపెచ్చులు.. వేలాడుతున్న కరెంట్‌ తీగలు.. విరిగిపోతున్న బల్లలు, కుర్చీలు.. కొత్త గదుల నిర్మాణం దేవుడెరుగు, ఉన్న భవనాలు దాదాపుగా శిథిలావస్థకు చేరాయి. వంటగదుల సంగంతి చెప్పనక్కర్లేదు. వానొస్తే బురద.. గాలొస్తే తంటా. పేద, మధ్యతరగతి పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కన్పిస్తున్న దృశ్యాలు.

ఈ దుస్థితిని మార్చేస్తామని, కార్పొరేట్‌కు ధీటుగా సర్కార్‌ బడిని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెప్పింది. 12 రకాల పనులతో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమంది. ఈ కార్యక్రమానికి ‘మన ఊరు–మనబడి’ అనే పేరు పెట్టింది. దశలవారీగా అమలు చేసే ఈ కార్యక్రమంలో తొలిదశను ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. కొన్నిచోట్ల పనులు అసలు ప్రారంభమే కాలేదు. పనులు మొదలైన చోట్లా సవాలక్ష అవాంతరాలు చోటు చేసుకుంటున్నాయి. మోకాలెత్తు పునాదులు.. మొండి గోడలే దర్శనమిస్తున్నాయి.  

నిధుల ప్రకటనలతోనే సరి.. 
మన ఊరు– మనబడి కార్యక్రమాన్ని 2021 మార్చి బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్ళల్లో రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్టు తెలిపింది. కానీ 2021–22లో నిధులు కేటాయించలేదు. 2022 మార్చి బడ్జెట్‌లో రూ.7,289 కోట్లు మూడు విడతలుగా పాఠశాలల్లో మౌలిక వసతులకు కేటాయిస్తామని ప్రకటించింది. అదే నెలలో సీఎం కేసీఆర్‌ వనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూళ్ళు తెరిచే నాటికే పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. కానీ స్కూళ్ళకు మళ్ళీ సెలవులొస్తున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.  

తొలిదశ స్కూళ్లకే.. 
రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ స్కూళ్ళల్లో తొలివిడతగా ఈ సంవత్సరం 9,123 స్కూళ్ళను ఈ పథకం కింద ఎంపిక చేశారు. తొలి దశలో చేపట్టే పనులను రూ.3,497 కోట్లతో పూర్తి చేయాలని భావించారు. నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నిచర్‌ ఏర్పాటు, రంగులు వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్‌ బోర్డులు, ప్రహరీ గోడలు కట్టడం, వంటగది ఏర్పాటు, మరమ్మతులు, శిధిల భవనాల స్థానంలో కొత్త గదుల నిర్మాణం, డిజిటల్‌ సౌకర్యాల వంటి 12 రకాల పనులు ఈ నిధులతో చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ పూర్తిస్థాయిలో ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇప్పటివరకు 8,833 బడులకు పరిపాలన అనుమతులు రాగా 7,211 బడుల్లో పనులు మొదలయ్యాయి. ఇప్పటివరకు 1,200 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి.  

ముందుకురాని కాంట్రాక్టర్లు 
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొన్ని స్కూళ్లకైనా మరమ్మతులు చేసి, మెరుగ్గా చూపించాలని ప్రభుత్వం ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో భావించింది. ఈ దిశగా వివిధ శాఖల అధికారులతో విద్యాశాఖ మంత్రి సమీక్ష జరిపారు. కానీ ప్రతిచోట ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. రూ.30 లక్షల లోపు పనులన్నీ స్థానిక విద్యా కమిటీ నేతృత్వంలో చేయించే అవకాశం ఉంది. 

అంతకు మించితే టెండర్లు పిలవాలి. ఇలాంటి పనులు 2 వేల వరకు ఉన్నాయి. విద్యా కమిటీ నేతృత్వంలో ఎక్కువగా చిన్నా చితక పనులే చేపడుతున్నారు. కరెంట్‌ వైర్లు సరి చేయడం, గోడలకు రంగులేయడం, పెచ్చులూడితే ప్లాస్టింగ్‌ చేయడం వంటివే ఉంటున్నాయి. 

నిర్మాణాలు, శౌచాలయాల (మరుగుదొడ్లు) ఏర్పాటు వంటి పనులు ఎక్కడా మొదలవ్వలేదు. కొన్ని చోట్ల నిర్మాణాలు మొదలైనా నిధులు అందక ఆగిపోతున్నాయి. దీంతో చాలాచోట్ల టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల నాలుగు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించ లేదు. సకాలంలో బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేదంటూ వాళ్ళు వెనక్కు తగ్గుతున్నారు. 

ఎక్కడైనా ఇదే పరిస్థితి... 
►ఆదిలాబాద్‌ జిల్లా మావల–1 మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మాణానికి మన ఊరు–మన బడి పథకం కింద టెండర్లు పిలిచారు. కానీ ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. మావల–2 మండల కేంద్రంలోని మరో ప్రైమరీ స్కూల్‌ నిర్మాణం పనులు మొదలైనా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్‌ మధ్యలోనే పని ఆపేశాడు. బజార్‌ హత్నూర్‌ మండలం కోల్హారిలో రూ.12 లక్షలతో ప్రతిపాదించిన స్కూల్‌ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తవ్వలేదు. 

►హనుమకొండ సుబేదారిలోని హైస్కూల్‌లో తరగతి గదుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్‌ పనుల మాత్రమే మొదలు పెట్టారు. పగిలిపోయిన ఫ్లోరింగ్‌ గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రమాదకరంగా మారిందని మన ఊరు–మనబడి సమీక్షల్లో చెప్పినా స్పందన కరువైందని స్థానికులు తెలిపారు. సుబేదారి ప్రైమరీ స్కూల్‌లో శౌచాలయాల పనులు మధ్యలోనే ఆగిపోయాయి.  

►మంచిర్యాల జిల్లా జన్నారంలో పనులు నత్త నడకను తలపిస్తున్నాయి. పొన్నెకల్‌ ప్రాథమిక స్కూల్‌ భవన నిర్మాణం పిల్లర్ల దశలో ఉంది. ధర్మారంలోని స్కూల్‌ బిల్డింగ్‌ ఇంకా రూఫ్‌ లెవల్‌లోనే ఉంది. కలమడుగు గ్రామంలోని స్కూల్‌లో శౌచాలయాల నిర్మాణం పునాదుల దశలోనే పురిటినొప్పులు పడుతోంది.  

►నిర్మల్‌ జిల్లా కొండాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చోవాల్సిన పరిస్థితి. అదే గదిలో విద్యార్థులకు వంట చేయడం జరుగుతోంది. పాడుబడ్డ మరుగుదొడ్ల  కారణంగా ఆరుబయలే దిక్కవుతోంది.  

►జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నత పాఠశాల గదులన్నీ శిథిలావస్థకు చేరాయి. గదుల నిర్మాణం కోసం ఇంకా టెండర్లు ఖరారు కాలేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top