కలిసి పనిచేద్దాం..

Google Vice President Chandrasekhar meeting with CM Revanth Reddy - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు మేం సిద్ధం.. 

సీఎం రేవంత్‌రెడ్డితో భేటీలో గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గూగుల్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తోట గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, రాష్ట్రం కోసం వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు సంబంధించిన డిజిటలైజేషన్‌ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడానికి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు.

పౌరుల అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన సేవలు అందించడానికి అవసరమైన సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని వివరించారు. రహదారుల భద్రత విషయంలో గూగుల్‌ మ్యాప్స్, గూగుల్‌ ఎర్త్‌ సేవలను వినియోగించేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సీఎంను కలిసిన అరుణ్‌తివారీ, చిన్నబాబు  
‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ పుస్తక రచయిత అరుణ్‌తివారీ, కేన్సర్‌ రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ చిన్నబాబు సుంకవల్లి సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.  

సీఎంతో మైక్రాన్‌ ప్రెసిడెంట్, సీఈఓ భేటీ 
ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్‌ల తయారీ కంపెనీ మైక్రాన్‌టెక్నాలజీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అన్నిరకాల సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మైక్రాన్‌ కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్‌ మెహ్రోత్రా గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మైక్రాన్‌ టెక్నాలజీ సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top