ఫొటోలు దిగడం తప్ప ప్రజలకు చేసిందేమిటో..!

GHMC Governing Body Completed One Year Rule, Status Report - Sakshi

అధికారుల అజెండాలకు జెండాలూపారు 

జీహెచ్‌ఎంసీ పాలక మండలికి ఏడాది పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: బాధ్యతల స్వీకరణకు ముందు పలు వివాదాలకు కారణమై.. తీవ్ర ఉత్కంఠ రేపి ఎట్టకేలకు ఎన్నికయ్యాక రెండు నెలల తర్వాత పగ్గాలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఏడాది కాలంలో ఏం చేసిందో కనిపించడం లేదు. పైపెచ్చు కార్పొరేటర్ల నుంచి మేయర్‌ వరకు అవకతవకలు, సొంతలాభం వంటి మరకలంటుకున్నాయి. ఇక మహిళా సాధికారత లక్ష్యంగా అతివలకు ప్రాధాన్యమిచ్చినా.. పతుల తోడు లేనిదే ముందుకు కదలని వారు ఎందరో. 

నగరం గురించి విజన్‌ ఉందని.. చేయాలనుకున్నవి చేసి చూపిస్తామన్న మేయర్‌ తన విజన్‌ను ఏమేరకు అమలు చేశారో ఆమెకే తెలియాలి. పాలకమండలి పగ్గాలు చేపట్టినప్పటికీ, స్వతంత్ర నిర్ణయాలతో పనిచేసిన దాఖలాల్లేవు. అధికారుల అజెండాలకు.. పాలకమండలి సభ్యులు పచ్చజెండాలూపి ఫొటోలు దిగడం తప్ప వారు చేసిందేమిటో ప్రజలకు తెలియడం లేదు. 

► గత ఏడాది ఫిబ్రవరి 11న పాలకమండలి కొలువుదీరినప్పటికీ, జూన్‌ 29 వరకు సర్వసభ్య సమావేశమే జరగలేదు. బడ్జెట్‌ ఆమోదం కోసం వర్చువల్‌గా నిర్వహించారు. ఆ సమావేశంపై ప్రతిపక్ష బీజేపీ పెదవి అసంతృప్తి  వ్యక్తం చేసింది. అనంతరం డిసెంబర్‌ 18న భౌతికంగా సమావేశాన్ని నిర్వహించినా.. బల్దియా చరిత్రలో అంతకు ముందెన్నడూ లేనివిధంగా కౌన్సిల్‌ హాల్‌లోకి మీడియాకు  అనుమతి నిరాకరించి చీకటి దినంగా గుర్తుండేలా చేశారు.  

► తమ వాణి వినిపించేలా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు డిమాండ్‌ చేసిన బీజేపీ సభ్యులు నవంబర్‌ 23న మేయర్‌ చాంబర్‌లో రణరంగం సృష్టించారు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు నమోదు చేశారు. పాలకమండలి పగ్గాలు చేపట్టా క తొమ్మిదినెలల తర్వాత నవంబర్‌లో స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. గతంలో మాదిరిగానే టీఆర్‌ఎస్, ఎంఐఎం పరస్పర ఒప్పందంతో టీఆర్‌ఎస్‌ నుంచి 8 మందికి ఎంఐఎం నుంచి ఏడుగురికి అవకాశం కల్పించారు. 

మరిన్ని విశేషాలు.. 
► ఎస్‌ఎఫ్‌ఏల తొలగింపు, నియామకాల్లో జోక్యంతో మేయర్‌ సీటు వన్నె తగ్గింది. అధికారిక, అనధికారిక అన్ని కార్యక్రమాల్లోనూ డిప్యూటీ మేయర్‌ వెంట ఆమె భర్త ఉండటం చర్చనీయాంశంగా మారింది. మహిళా సాధికారతపై సంశయాలు రేకెత్తించింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ నిధుల నుంచి మేయర్, డిప్యూటీ మేయర్‌ వంటి వారు కార్యాలయాలు, క్యాంప్‌ కార్యాలయాల ఆధునికీకరణల పేరిట నిధులు దుబారా చేయడం వారి ఆశను వెల్లడించింది. (చదవండి: నిషా ముక్త్‌ నగరమే లక్ష్యం)

► వానలు రావద్దని కోరుకుంటానంటూ మేయర్‌ వ్యాఖ్యానించడం,  ఇంటికి జనరేటర్‌ కావాలని కోరడం వివాదాలకు కారణమయ్యాయి. స్వచ్ఛ హైదరాబాద్, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో నగరం  మెరుగైన ర్యాంక్‌ సాధించడం కలిసి వచ్చింది. ర్యాంకులొచ్చినా, స్వచ్ఛ ఆటోలు పెరిగినా, చెత్త సమస్యలు తీరలేదు. ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాలో పోస్టింగులకు ప్రాధాన్యం పెరిగింది. సామాన్య ప్రజల ఫిర్యాదులు స్వీకరించే దిక్కు లేకుండా పోయింది.  

► పాలకమండలికి  అధికార యంత్రాంగంపై పట్టులేక పోవడం వెల్లడైంది. జోన్లు,సర్కిళ్ల స్థాయిలో అవినీతి పెచ్చరిల్లిందనే విమర్శలున్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ ఎవరు కార్యాలయాలకు వస్తున్నారో, ఎవరు రావడం లేదో తెలియని దుస్థితి. అందరికీ బయోమెట్రిక్‌ హాజరు అన్నది పబ్లిసిటీకి మాత్రం పనికొచ్చింది. కంట్రోల్‌ రూమ్‌ల పేరిట ఖర్చులు పెరిగాయి. గతంలోని కంట్రోల్‌ రూమ్‌ చేయలేకపోయిందీ.. కొత్తగా ఏర్పాటు చేసింది చేస్తున్నదేమిటో పట్టించుకున్న వారు లేరు. (చదవండి: మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు!)

► కనీస సమాచారం సైతం కరువైన దుస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో మేయర్‌ జోన్లవారీ సమీక్షలు నిర్వహిస్తుండటం చెప్పుకోదగ్గ అంశం. సభా మర్యాదలు మంట గలిశాయి. ఒక్క సమావేశమే జరిగినా అర్థవంతమైన చర్చల సంగతటుంచి నువ్వా.. నేనా..? తేల్చుకుందామన్నట్లుగా వ్యవహరించారు. ఏడాదైనా వార్డు కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇలా.. ఇంకా.. ఎన్నో.. ఎన్నెన్నో!  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top