హైదరాబాద్: సంపన్న బాలికలకు వలపు వల విసురుతూ అన్నదమ్ములు రూ.లక్షల్లో దండుకున్న కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల విచారణలో వెల్లడైన మేరకు.. కూకట్‌పల్లికి చెందిన ఈవెంట్ మేనేజర్ కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ (22) ఖరీదైన అద్దె కార్లలో తిరుగుతూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫొటోలు పెట్టి సంపన్న బాలికలు, యువతులతో పరిచయాలు పెంచుకున్నాడు. వెయ్యిమంది యువతులు ఫాలోవర్స్ ఉన్న అతడికి తల్లి మీనాకుమారి, మేనమామ ప్రశాంత్ ప్రోత్సాహం ఉంది.
నిందితుడితో పాటు అతడి సోదరుడు రాజీవ్‌ను పొక్సో కింద అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించి 4 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరి స్నేహితుడు కార్తీక్‌ను అరెస్టు చేశారు. మంగళవారం మీనాకుమారి, ఆమె స్నేహితుడు వినీల్‌చౌదరి, ప్రశాంత్, చంద్రశేఖర్ స్నేహితులు హేమంత్, జితిన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చంద్రశేఖర్ ముఠా నాయకుడిగా వ్యవహరిస్తూ అమ్మాయిలకు వల వేసేలా స్నేహితులను ప్రోత్సహించినట్లు తేలింది. వారి వీడియోలను అడ్డంపెట్టుకుని రూ.లక్షల్లో వసూలు చేసినట్లు గుర్తించారు.
సీపీ రంగంలోకి దిగింది అందుకే..
కొంతమంది కొత్త తరహా వసూళ్లకు తెరలేపారని, నగరంలో ఇది చాపకింద నీరులా విస్తరిస్తోందని చంద్రశేఖర్ అరెస్టుతో పోలీసులు నిర్ధారిస్తున్నారు. అందమైన యువకులను, ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిని గుర్తించి డబ్బు సాయం చేస్తూ ఖరీదైన కార్లు ఇస్తున్నారు. పబ్‌లు, క్లబ్‌లలో జల్సాలకూ సాయం చేస్తున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసి సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. తర్వాత వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్ స్వయంగా కేసు విచారించినట్లు తెలుస్తోంది. ఆదిలోనే ఈ సంస్కృతికి చెక్ పెట్టాలని, వీరి వెనుక ఎవరున్నారో చూడాలని మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యను ఆదేశించినట్లు సమాచారం.


