
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండో రోజు వినాయక నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ దారులన్నీ గణేశుడి ప్రతిమలతో నిండిపోయాయి. మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగింది.
ఇక, ఒక్క హుస్సేన్ సాగర్‌లో 11 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిమజ్జన పాయింట్లు, నిమజ్జన ఊరేగింపు మార్గాలలో వ్యర్థాల తొలగింపును జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఇక, టాంక్ బండ్ పరిసరాల్లో ఇంకా సందడి కొనసాగుతోంది. గణేష్ ప్రతిమలు బారులు తీరడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
కాగా, ఎల్బీనగర్ పరిధిలో 35,994, చార్మినార్ 22,304, ఖైరతాబాద్ 63,019, శేరిలింగంపల్లి 41,360, కూకట్ పల్లి 62,405, సికింద్రాబాద్ పరిధిలో 36,251 విగ్రహాలను నిమజ్జనం చేశారు. మరోవైపు.. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. నగరంలో వినాయక నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఎల్బీనగర్ వద్ద మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు కిక్కిరిసి కనిపించారు.

