వరద సాయం నిలిపివేత.. బాధితుల ఆగ్రహం

Flood Victims Protest For Stop Financial Assistance In Hyderabad - Sakshi

వరదసాయం పంపిణీలో రాజకీయ నేతల చేతివాటం  

బాధితుల ఆందోళన బాట

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వం ప్రకటించిన వరదసాయంపై గల్లీగల్లీలో లొల్లి ఊపందుకుంది. ఎక్కడ చూసినా తమకు పరిహారం అందలేదంటూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. అసలైన బాధితులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్‌ డివిజన్ల పరిధిలో ఈనెల 22  నుంచి వరద సాయం పంపిణీ ప్రారంభమైంది. అయితే అర్హులైన వారిని పక్కన బెట్టి ఇంటి యజమానులు, లీడర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు ఇలా తలా కొంచెం పంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రికార్డుల్లో రూ.10 వేలు ఇచ్చినట్లు రాసుకొని రూ.5 వేలే ఇస్తున్నారంటూ మరికొన్ని చోట్ల బాధితులు అధికారులను నిలదీస్తున్నారు. ఇంకొన్ని చోట్ల డబ్బు పంచి వెళ్లాక లీడర్లు వచ్చి అందులో రూ.3వేల దాకా వసూలు చేస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (రాజకీయ జోక్యం: ఆగిన వరద సాయం)

గల్లీగల్లీలో నిలదీతలు, ఆందోళనలు
ఈ క్రమంలోనే వరద సాయాన్ని ప్రభుత్వం తాత్కలికంగా నిలిపివేయడంతో బాధితలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గల్లీగల్లీలో నిలదీతలు, ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. తమకు వచ్చే సొమ్మును కూడా కొందరు రానివ్వడంలేదని ఆందోళనలు దిగుతున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వరద బాధితుల ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రూ.10వేలు వరద సాయం అందలేదని జీడిమెట్ల పీఎస్ వద్ద మహిళల బైఠాయించారు. దీంతో జీడిమెట్ల రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే వెంకటేష్‌ ఇంటి ముందు బస్తీవాసుల ధర్నా నిర్వహించగా.. కర్మన్‌ఘాట్‌లో వరద బాధితులు ధర్నాకు దిగారు.

నగరంలోని ఎంఎస్‌ మక్తా, బీఎస్‌ మక్తా, ప్రేమ్‌నగర్, ఫిలింనగర్, ఎంజీనగర్, వినాయకనగర్, బాల్‌రెడ్డి నగర్, ఎన్‌బీనగర్‌ తదితర ప్రాంతాల్లో అర్హులు తమకు పరిహారం ఏదీ అంటూ నిలదీశారు. కిరాయిదారులకు వరద సాయం అందడం లేదంటూ అడుగడుగునా ధర్నాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో వరద సాయం కింద రూ.40 కోట్ల వరకు మంజూరు కాగా ఇప్పటి వరకు 35 వేల మందికి వరద సాయాన్ని పంపిణీ చేశారు. అయితే వరదల్లో నష్టపోయిన వారు లక్షలకు పైగానే ఉన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇంకో రెండు రోజల పాటు సాయం పంపిణీ చేసినా వీరందరికీ అందే పరిస్థితి కనిపించడం లేదు. వరదలతో సర్వం కోల్పోయిన వారికి చేయూతనివ్వాల్సింది పోయి వాళ్లవద్దే బొక్కుతున్నారంటూ మహిళలు దుయ్యబడుతున్నారు. 

సగం మీకు.. సగం మాకు!
మీర్‌పేట: వరద బాధితులకు తక్షణ సాయం కింద ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ముంపు బాధితులకే కాకుండా ప్రతి ఇంటికి రూ.10వేలు పంపిణీ చేస్తుండటంతో చాలా మంది నాయకులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మీర్‌పేట కార్పొరేషన్‌లోని డివిజన్లలో ప్రజలకు ఆర్థిక సాయం ఇప్పిస్తూ.. అందులో సగం నొక్కేస్తూ.. మిషన్‌ ఫిఫ్టీ – ఫిఫ్టీ దందాకు తెరలేపారు. 

జేబులు నింపుకుంటున్న స్థానిక నేతలు.. 
ప్రభుత్వం చేపట్టిన రూ.10వేల ఆర్థిక సాయం కార్యక్రమం స్థానిక నాయకులకు వరంగా మారింది. అసలైన బాధితులకు కాకుండా ఇతరులకు నగదు ఇప్పిస్తూ స్థానిక నేతలు జేబులు నింపుకుంటున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అంతేగాకుండా మరోచోట ఉండే ఇళ్ల యజమానులను పిలిపించి వారికి సగం ఇచ్చి మరో సగం నొక్కేస్తుండడంతో పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అందజేసిన రూ.10 వేలలో తనకు 5 వేలు మాత్రమే ఇచ్చారని ఓ యజమాని దీనిపై కార్పొరేషన్‌ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. తాజాగా గురువారం సాయంత్రం ఈ వ్యవహారమంతా అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా.. 
వరదలతో నష్టపోయిన తమకు ఇంత వరకు రూ.10వేలు అందలేదని జిల్లెలగూడ కమలానగర్‌ కాలనీవాసులు గురువారం సాయంత్రం మీర్‌పేట కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వరదనీటితో తమ ఇళ్లు పూర్తిగా ముంపునకు గురైనప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోకపోవడం బాధాకరమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి తమకు వరద సహాయం అందజేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

పోలీస్‌ సార్లు... మీరైనా పరిహారం ఇప్పించండి 
పహాడీషరీఫ్‌ : ప్రభుత్వం వరద బాధితులకు అందిస్తున్న రూ.10 వేల ఆర్థిక సాయం కొందరికే దక్కుతుండడంతో ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీలోని 20వ వార్డు శ్రీరాం కాలనీలో కౌన్సిలర్‌ తనకు అనుకూలంగా ఉన్నవారికే పరిహారం ఇప్పిస్తున్నారని స్థానిక మహిళలు పెద్ద ఎత్తున కార్గో రోడ్డులో ఆందోళనకు దిగారు. ‘మీరు ఓట్లు వేయనందుకే తనకు తక్కువ మెజార్టీ వచ్చిందని, దిక్కున్న చోట చెప్పుకోండంటూ కౌన్సిలర్‌తో పాటు ఆమె భర్త’ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని మహిళలు ఆరోపించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన పహాడీషరీఫ్‌ పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఆపి ‘మీరైనా పరిహారం ఇప్పించండి’ సారు అంటూ విన్నవించుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top