
యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్‌లో రైతులు
ఓ అన్నదాతకు ఫిట్స్...అనేకమంది అస్వస్థతకు లోనవుతున్న వైనం
సాక్షి నెట్‌వర్క్ : యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడుతున్న వారు అనారోగ్యం పాలవుతున్నారు.
» మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్ట్ వద్ద ఇల్లెందు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు యూరియా కోసం నాలుగు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ వద్ద మంగళవారం కూడా రైతులు బారులుతీరారు.
కురవి సొసైటీ వద్ద కూపన్ల కోసం క్యూలో నిలబడి రైతులు నానా అవస్థలు పడ్డారు. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్ వద్దకు సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు వేల మంది రైతులు యూరియా కోసం వచ్చారు. క్యూలో ఉన్న గాంధీనగర్‌కు చెందిన ఆవుల నారాయణ అనే రైతుకు ఫిట్స్ వచ్చింది. నర్సింహులపేటలో కూపన్లు ఇవ్వకపోవడంతో రైతులు పట్టాపాస్ బుక్కుల జిరాక్స్ కాపీలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
» వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.
» మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరు«ధ్‌రెడ్డి తన కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆగ్రో సేవా కేంద్రం దుకాణం వద్దకు వెళ్లారు. యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు ఒక్కసారిగా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు యూరియా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను సముదాయించి మాట్లాడిన ఎమ్మెల్యే అనిరు«ధ్‌రెడ్డి వెంటనే కలెక్టర్ విజయేందిరకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. సాయంత్రంలోగా యూరియాను అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు.
» దేవరకద్రలో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చినా టోకెన్లు ఇచ్చి వెనక్కి పంపుతున్నారని, యూరియా మా త్రం ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. ఉదయం 6 గంటలకే రాయచూర్ జాతీయరహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాయచూర్–మహబూబ్‌నగర్ వైపు వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
» వనపర్తి జిల్లావ్యాప్తంగా యూరియా ఆందోళనలు కొనసాగాయి. ఖిల్లాఘనపురంలో రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు.
» నాగర్‌కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. అచ్చంపేటలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
» గద్వాల సింగిల్‌విండో కార్యాలయానికి దాదాపు 400 మంది రైతులు మంగళవారం ఉదయం 8 గంటల వరకే చేరుకున్నారు. యూరియా లేదని అధికారులు చెప్పడంతో అంబేడ్కర్ చౌక్‌లో రోడ్డుపై బైఠాయించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా లేకపోవడంతో రైతులు రాస్తారోకో చేశారు.
» కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీ వద్ద లారీ లోడ్ వచ్చిందని సమాచారం అందుకున్న రైతులు అక్కడకు వెళ్లారు. సోమవారం టోకెన్లు ఇచ్చామని చెప్పడంతో రైతులు రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు.

రైతు సమస్యలపై అదే నిర్లక్ష్యం
ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందని, ప్రధాని మోదీ హామీలు జుమ్లాలుగానే మిగిలిపోతున్నాయని ఏఐసీసీ ఏపీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ రైతులకు జుమ్లాలు అవసరం లేదని.. వారికి కావలసింది సమయానికి ఎరువులేనన్నారు. ఏపీ, తెలంగాణకు కలిపి ఏటా సుమారు 24–25 ఎల్‌ఎంటీ యూరియా అవసరం ఉంటుందని ఠాగూర్ గుర్తు చేశారు.
అయినప్పటికీ ప్రతి విత్తన సీజన్‌లో.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎరువు కొరత తలెత్తుతోందని చెప్పారు. రైతులు గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎస్‌సీవో వంటి అంతర్జాతీయ వేదికల్లో ఫొటోలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. రైతుల కోసం దీర్ఘకాలిక ఎరువుల సరఫరా ఒప్పందాలు కుదుర్చేందుకు ఈ వేదికలను ఉపయోగించే ఆలోచన ఆయనకు ఉందా? అని ఠాగూర్ ప్రశ్నించారు.
ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తాం
మరో వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడానికి కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సోమవారం, 9,000 మెట్రిక్ టన్నులు, మంగళవారం మరో 5,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందన్నారు.
ఈ యూరియా రైల్వే రేక్ పాయింట్లయిన సనత్‌నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు. వచ్చే వారంరోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా మరో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ఎరువులను రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. వరదలతో నష్టపోయిన రైతులకు అన్యాయం జరగకుండా, సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకోసం పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, 5 రోజుల్లోపు పంటనష్టంపై పూర్తి నివేదికను పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.