భూమి కోల్పోయాననే ఆవేదనతో..

EX Naxalite Suicide Attempt Front Of Tehsildar Office In Bhadradri Kothagudem  - Sakshi

మాజీ నక్సలైట్‌ ఆత్మహత్యాయత్నం 

ఇల్లెందురూరల్‌: ప్రభుత్వ శాఖల సమన్వయలోపం వల్లే తనకు భూ సమస్య ఏర్పడిందని ఓ మాజీ నక్సలైట్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందుకు చెందిన కొడెం సమ్మయ్య పీపుల్స్‌వార్‌లో సుదీర్ఘ కాలం పనిచేసి, 2008లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఆ సమయంలో పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు పునరావాసం కింద 1.20 ఎకరాల భూమినికి అతడికి కేటాయించారు. ఆ భూమిని వైటీసీ నిర్మాణానికి మళ్లీ అధికారులు స్వా ధీనం చేసుకుని, సుభాష్‌నగర్‌ గురుకులం వెనుక ఇచ్చారు. అయితే ఆ భూమిని ఓ పార్టీకి చెందిన నేత ఆక్రమించుకోవడంతో న్యాయంకోసం సమ్మయ్య కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక రెవెన్యూ అధికారుల సూచనతో అతడికి కేటాయించిన భూమిలో గుడిసె వేసుకుంటే, సదరు నేత ఫిర్యాదుతో పోలీసులు సమ్మయ్యను అడ్డుకుంటున్నారు.

అధికారికపత్రం లేకుండా సమ్మయ్యను భూమి జోలికి వెళ్లొద్దని పోలీసులు చెబుతుండగా..మరోవైపు భూమిహక్కుకు సంబంధించి రెవెన్యూ అధికారులు స్పష్టమైన పత్రాలు ఇవ్వకపోవడంతో వారిపై న్యాయపోరాటం చేసేందుకు అతడికి అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వచ్చి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా అక్కడే ఉన్న కార్యాలయ సిబ్బంది, ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకున్నారు. కాగా, ఈ ఘటనపై తహసీల్దార్‌ కృష్ణవేణి స్పందిస్తూ రెండు రోజుల్లో సమ్మయ్యకు భూమి అప్పగింతపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top