సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు కోర్టుధిక్కరణే

Ex Collector To Tender Unconditional Written Apology: AG To High Court - Sakshi

నోటీసులు జారీచేసిన హైకోర్టు ధర్మాసనం 

క్షమాపణలు చెప్పేందుకు వెంకట్రామిరెడ్డి సిద్ధం: ఏజీ 

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆదేశించినా వరి విత్తనాలు అమ్మినవారి దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వనంటూ సిద్దిపేట మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కోర్టుధిక్కరణ కిందకు వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయంటూ ఈ వ్యవహారాన్ని సుమోటోగా కోర్టుధిక్కరణ కింద విచారణకు స్వీకరించింది.

ఈ మేరకు వెంట్రామిరెడ్డికి మంగళవారం నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. యాసంగిలో ఒక్క కిలో వరి విత్తనాలు కూడా అమ్మడానికి వీల్లేదని, తన మౌఖిక ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా విత్తనాలు అమ్మితే వారి దుకాణాలు సీజ్‌ చేస్తామని, కోర్టులు ఆదేశించినా వాటిని తెరిచేందుకు అనుమతి ఇవ్వమంటూ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
చదవండి: గిన్నిస్‌ బుక్‌లో రికార్డులు సృష్టిస్తున్న శ్రీ వాస్తవ.. ఇంతకీ ఏం చేస్తోంది

వీటి పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌.. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు కోర్టుధిక్కరణ కిందకు వస్తాయని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన న్యాయమూర్తిని కోరారు. స్పందించిన ధర్మాసనం కోర్టుధిక్కరణ వ్యాజ్యంగా విచారించింది. వెంకట్రామిరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇదే విషయాన్ని సింగిల్‌ జడ్జి వద్ద తెలియజేశామని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు.

ఇదిలా ఉండగా, రాజ్యాంగ ధర్మాసనాలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన వెంకట్రామిరెడ్డిపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నేత తూంకుంట నర్సారెడ్డి దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే తాము కోర్టుధిక్కరణ కింద నోటీసులు జారీచేసిన నేపథ్యంలో మరో పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది. తాము విచారిస్తున్న పిటిషన్‌లో వాదనలు వినిపించుకోవచ్చని స్పష్టం చేసింది.  

ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోండి.. 
వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఆయన నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశించాలని, రాజీనామాను కూడా ఆమోదించకుండా ఆదేశాలు జారీచేయాలంటూ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది.

ఇప్పటికే ఆయన నామినేషన్‌ను స్వీకరించి ఎమ్మెల్సీగా ఎన్నిక ప్రక్రియ పూర్తయినందున.. ఐఏఎస్‌ అధికారిగా రాజీనామా ఆమోదంపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది. ఐఏఎస్‌ అధికారుల రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించే అధికారం లేదంటూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన శంకర్‌తోపాటు మరొకరు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top