హైదరాబాద్: శస్త్రచికిత్సలు, తీవ్ర అనారోగ్యం తర్వాత రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి 'ట్రాన్సిషనల్ కేర్' (మధ్యంతర సంరక్షణ) ఎంతో కీలకమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు. ఇవాళ (బుధవారం) హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన 'ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్' సెంటర్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జగదీష్ గౌడ్, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్ మౌనికా రెడ్డి అట్ల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. "సాధారణంగా ఆసుపత్రులు రోగుల ప్రాణాలను కాపాడి నిలకడగా ఉంచుతాయి. కానీ, వారు తిరిగి సాధారణ జీవనశైలికి చేరుకోవడానికి ప్రత్యేక పునరావాస కేంద్రాల అవసరం ఉంది. మన దేశంలో ఇటువంటి ప్రత్యేక కేంద్రాల కొరత ఉంది. అమెరికా ప్రమాణాలతో ఎవరెస్ట్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడం అభినందనీయం" అని అన్నారు.

ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ కె. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో 20 ఏళ్ల క్లినికల్ అనుభవం తర్వాత, స్వదేశంలో ప్రపంచస్థాయి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. పక్షవాతం (స్ట్రోక్), వెన్నెముక గాయాలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడే వారికి ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందిస్తామని వివరించారు. వైద్యులు, స్థానిక నేతలు ఈ కేంద్రాన్ని సందర్శించి, ఇక్కడి అత్యాధునిక వసతులను పరిశీలించారు. నగరం నడిబొడ్డున ఇలాంటి సమగ్ర పునరావాస కేంద్రం అందుబాటులోకి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రత్యేకతలు:
అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ మరియు స్పెషలైజ్డ్ థెరపీ జోన్లు
డిమెన్షియా (మతిమరుపు), పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక విభాగాలు
అమెరికా దేశపు ఎవిడెన్స్ బేస్డ్ రీహాబిలిటేషన్ ప్రోటోకాల్స్.


