కరోనా వ్యాక్సిన్‌.. వెనక్కితగ్గిన ఈటల

Etela Rajender Stepdown To Coronavirus Vaccine - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో భారత్‌లోనూ పంపిణీ షూరు అయ్యింది. కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. తొలి టీకాను ఢిల్లీ ఎయిమ్స్‌లోని శానిటైజర్‌ కార్మికుడు మనీష్‌ కుమార్‌కు వేయగా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ టీకా ప్రక్రియ ఆరంభమైంది. అయితే తొలి టీకాను తానే వేసుకుంటానని ప్రకటించిన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. శనివారం గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ ప్రక్రియను ఆరంభించిన ఆయన.. తొలి టీకా వేసుకోలేదు. కరోనా తొలి టీకాను పారిశుధ్య కార్మికులు, హెల్త్‌ వర్కర్స్‌కు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను జారీచేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే గాంధీ ఆస్పత్రిలో హెల్త్ వర్కర్‌ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు. (కరోనా వ్యాక్సినేషన్‌ తొలి టీకా.. వీడియో)

మంత్రులకు, ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ నాయకులు తొలి విడతలోనే టీకా వేయించుకుంటే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని కేంద్ర పెద్దలు అభిప్రాయపడ్డారు. దీంతో వెనక్కి తగ్గిన ఈటల.. తొలి వ్యాక్సిన్‌ వేసుకునేందుకు నిరాకరించారు. అయితే కోవిడ్‌ నియంత్రణకు రూపొందించిన టీకాపై ప్రజల్లో ఆందోళనలు తొలగించేందుకు తాను వ్యాక్సిన్‌ వేసుకుంటానని చెప్పినట్లు వివరించారు. వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలను తొలగించేందుకే అలా అన్నట్లు చెప్పారు. మరోవైపు తొలి టీకాను తాను వేసుకుంటాన్న ఈటల ప్రకటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. హెల్త్‌ వర్కర్స్‌, పారిశుధ్య కార్మికులను కాదని, తొలి విడతలో మంత్రులు వాక్సిన్‌ వేసుకోవడం సరైనది కాదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రి కేటీఆర్‌ సైతం వివరణ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన జాబితా ప్రకారమే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ జరుగుతోందన్నారు. (ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top