నింగికెగిసిన సాహిత్య శిఖరం | Sakshi
Sakshi News home page

నింగికెగిసిన సాహిత్య శిఖరం

Published Thu, Dec 29 2022 3:53 AM

Eminent Sanskrit Scholar Sribhashyam Vijayasarathy Passed Away - Sakshi

కరీంనగర్‌ కల్చరల్‌/సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి (86) కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒకటిన్నర సమయంలో శ్రీపురంకాలనీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కరీంనగర్‌ జిల్లా చేగుర్తి గ్రామంలో 1936 మార్చి 10న నరసింహాచార్యులు, గోపమాంబ దంపతులకు జన్మించిన విజయసారథి చిన్నప్పటి నుంచే పద్య రచన చేశారు.

ప్రాథమిక విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలోనే అయినప్పటికీ సంస్కృత పండితుడిగా రాణించారు. భాష్యం విజయసారథి పాండిత్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి 25న పద్మశ్రీ అవార్డు ప్రకటించగా 2021 నవంబర్‌ 8న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. 

మందాకిని కావ్యంతో ‘మహాకవి’గా గుర్తింపు: ఏడు సంవత్సరాల వయసునుంచే విజయసారథి సంస్కృతం నేర్చుకున్నారు. విజయ సారథికి మహాకవిగా గుర్తింపు తెచ్చిన కావ్యం మందాకిని. మందాకిని రచనను ఆయన కేవలం 48 గంటల్లోనే పూర్తి చేశారు. 150కిపైగా గ్రంథాలను భిన్నమైన సంస్కృత ప్రక్రియల్లో ఆయన రచించారు. తెలంగాణ ప్రభుత్వం ‘విశిష్ట సాహిత్య పురస్కారం’, తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యా లయం అందించే మహామహోపాధ్యాయ పురస్కారం, బిర్లా ఫాండేషన్‌ వాచస్పతి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలను ఆయన అందుకున్నారు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం
సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు.   శ్రీభాష్యం సాహితీ సేవలను సీఎం స్మరించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా శ్రీభాష్యం మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement