
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ సమ్మరీని విడుదల చేసింది. నియోజకవర్గంలో మూడు లక్షల 92,669 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో పురుషలు ఓటర్లు రెండు లక్షలు, మహిళ ఓటర్లు లక్షా 88 వేలకు పైచిలుకు ఉన్నారు. నియోజకవర్గంలో 47 పోలింగ్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఈనెల 17వ తేదీ వరకు ఫిర్యాదులు అభ్యంతరాలను తెలియజేయాలని ఎలక్షన్ కమిషన్ నోట్ విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థి ఎంపికపై దృష్టిసారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అవరోధాలను అధిగమించేందుకు సమాలోచనలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ అంటే రిచ్ ఏరియా అని గుర్తింపు.. అక్కడ పాగా వేయాలని అధికార కాంగ్రెస్‌తో పాటు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్, గ్రేటర్‌లో తమ బలం నిరూపించుకోవాలని బీజేపీలు ఉప ఎన్నికకు సై అంటున్నాయి.
ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు సీటు దక్కించుకుంటారా అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇక బై ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం నియోజకవర్గంలో ఓటర్లపై స్పష్టత ఇచ్చింది. ఈమేరకు సమ్మరీని విడుదల చేసింది.