వయోపరిమితి ఐదేళ్లు పెంపు? | Efforts underway to increase age limit for government job recruitment | Sakshi
Sakshi News home page

వయోపరిమితి ఐదేళ్లు పెంపు?

May 7 2026 2:16 AM | Updated on May 7 2026 2:16 AM

Efforts underway to increase age limit for government job recruitment

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపుపై కసరత్తు 

అతి త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం.. వయోపరిమితిపై స్పష్టత వచ్చాకే కొత్త కొలువుల భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వం పదేళ్లపాటు వయోపరిమితి సడలింపును ఇవ్వగా... ప్రస్తుతం ఆ ఉత్తర్వుల కాలపరిమితి తీరింది. దీంతో ఈ అంశంపై స్పష్టత ఇచ్చాకే కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈసారి వయోపరిమితి పెంపును ఐదేళ్ల పాటు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ఉద్యోగ నియామక ప్రకటనల జారీలో తీవ్ర జాప్యం నెలకొనడం... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాలకు దాదాపు పదేళ్లపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి రావడంతో ప్రభుత్వం అప్పట్లో పదేళ్లపాటు వయోపరిమితిని సడలించింది. దీంతో సాధారణ వయసు 34 సంవత్సరాలు కాగా... వయోపరిమితి సడలింపుతో 44 ఏళ్ల వయసు వరకు ఉద్యోగ అర్హత పరీక్షలు రాసే అవకాశం కలిగింది. తాజాగా ఐదేళ్లు మాత్రమే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లకే పరిమితం కానుంది. 

జీఏడీ వద్ద పెంపు అంశం 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. గతేడాది ప్రభుత్వం జాబ్‌ కేలండర్‌ ఇచ్చినప్పటికీ... ఉద్యోగ ప్రకటనలు మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం వయోపరిమితిపై స్పష్టత లేకపోవడంతో కొత్త నియామక ప్రకటనలు వెలువడటం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఆర్థిక శాఖ వద్ద ఉంది. గ్రూప్‌–1 కేటగిరీలోనే దాదాపు 160 ఖాళీలున్నట్లు సమాచారం. ఇతర కేటగిరీల్లో భారీగా ఖాళీలున్నాయి. వయోపరిమితి సడలింపు ఉత్తర్వులు వెలువడితే నూతన నియామకాలకు మార్గం సుగమం కానుంది. వయోపరిమితి సడలింపు అంశం ప్రస్తుతం సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశం తర్వాత దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 

పదేళ్లు పెంచాలని విజ్ఞప్తి 
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని పదేళ్లు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పొలిటికల్‌ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌తోపాటు పలువురు నిరుద్యోగులు భేటీ అయ్యి వినతిపత్రాన్ని సమర్పించారు. ఉద్యమ కాలంలో పదేళ్లపాటు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా పదేళ్ల కాలంలో ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. రెండు దశాబ్దాల కాలంలో సరైన నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి, అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై భట్టి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో చర్చించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం వయోపరిమితిపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement