‘లెక్కలు’ కుదర్లేదు!

Eamcet Exam Started In Telangana - Sakshi

కఠినంగా మ్యాథ్స్‌ పేపర్‌ 

విద్యార్థులకు సరిపోని సమయం.. మధ్యస్థంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ 

మొదలైన ఎంసెట్, 77.52 శాతం హాజరు

సాక్షి, హైదరాబాద్‌: రెండుసార్లు వాయిదాల తరువాత ఎంసెట్‌ ఎట్టకేలకు ప్రారంభమైంది. మొదటిరోజు పరీక్షకు 77.52 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం రెండు విడతల్లో 35,714 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయగా, 27,689 మంది పరీక్షకు హాజరైనట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ వెల్లడించారు. తెలంగాణలోని ఏడు పట్టణాల్లోని 79 కేంద్రాల్లో 17,003 మందికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా 14,555 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 9 పట్టణాల్లోని 23 కేంద్రాల్లో 18,711 మందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేయగా 13,134 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వివరించారు.

ఇక ఈనెల 10, 11, 14 తేదీల్లోనూ మరో ఆరు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇక బుధవారం జరిగిన పరీక్షలో మేథమెటిక్స్‌ కఠినంగా వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. సుదీర్ఘ సమాధాన ప్రశ్నల కారణంగా సమయం సరిపోలేదని వెల్లడించారు. ఇక మ్యాట్రిసెస్‌ సర్కిల్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు ఎంఎన్‌ రావు పేర్కొన్నారు. ఐదారు ప్రశ్నలు సుదీర్ఘమైనవి కావడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చిందని వెల్లడించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయని, బుధవారంనాటి పరీక్షల్లో సాధారణ విద్యార్థులకు160 మార్కులకు గాను 60 నుంచి 70 మార్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 

కరోనాతో తగ్గిన హాజరు శాతం 
ఎంసెట్‌కు హాజరైన విద్యార్థుల శాతం ఈసారి భారీగా తగ్గిపోయింది. కరోనా కారణంగా చాలా మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు హాజరుకాలేకపోయారు. గతేడాది మొదటి రోజు పరీక్షకు తెలంగాణలో 94.22 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. గతేడాది ఉదయం సెషన్‌లో తెలంగాణలో 25,023 మందికి గాను 23,543 మంది (94.1%) హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్‌లో 24,174 మందికి గాను 22,807 మంది (94.4%) హాజరయ్యారు. ఈసారి ఉదయం పరీక్షకు 8,602 మందికిగాను 7,415 మంది (86.20%) హాజరు కా గా, మధ్యాహ్నం పరీక్షకు 8,401 మందికి గాను 7,140 మంది (84.98%) హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ హాజరు మిగతా 6 సెషన్లలోనూ ఇలాగే కొనసాగే అవకాశముంటుందని వివరించారు. కాగా పరీక్ష కేంద్రాల్లో భౌతికదూరం పాటించలేదని, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారాలను సరిగ్గా తీసుకోలేదని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఇక ఆన్‌లైన్‌ పరీక్ష అయినందున అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేస్తే బాగుండేదని అభిప్రాయ పడ్డారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top