టాప్‌గేర్‌లో ఎంసెట్‌... రివర్స్‌లో జేఈఈ

EAMCET Demand Increasing Students Not Interested In JEE Telangana - Sakshi

ఏటా పెరుగుతున్న ఎంసెట్‌ దరఖాస్తులు

జేఈఈపై విద్యార్థుల్లో తగ్గుతున్న ఆసక్తి 

జేఈఈకి పోటీ ఎక్కువగా ఉండటం.. రాష్ట్రంలో కంప్యూటర్‌ కోర్సుల్లో సీట్లు పెరగడంతో మారిన వైఖరి 

కోవిడ్‌ తర్వాత ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడమూ కారణమే

సాక్షి, హైదరాబాద్‌: రానురాను జాతీయస్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీలవైపు మొగ్గుచూపే విద్యార్థులు తగ్గిపోతున్నారు. ఏటా జేఈఈ రాసే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, స్థానిక ఎంసెట్‌ రాసేవారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఇంటరీ్మడియెట్‌ నుంచే విద్యార్థులు ఎంసెట్‌ను లక్ష్యంగా పెట్టుకుంటున్నారని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి.

2014లో జేఈఈ మెయిన్స్‌ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ (సంయుక్త ప్రవేశ పరీక్ష) రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. 2018లో రాష్ట్రంలో 1.47 లక్షల మంది ఎంసెట్‌ రాయగా, 2022 నాటికి ఇది 1.61 లక్షలకు పెరిగింది. ఎంసెట్‌ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు పొందితే, జేఈఈ మెయిన్స్‌ ద్వారా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో, అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు.  

మార్పునకు కారణాలేంటి? 
సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) సర్వే ప్రకారం గ్రాడ్యుయేషన్‌ తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఉపాధి వైపే మొగ్గుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం కోసం వెతుక్కునే వారి సంఖ్య అబ్బాయిల్లో పెరుగుతోంది. కోవిడ్‌ తర్వాత ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. విద్యార్థులు కూడా ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక పట్టాతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎంఎస్‌ కోసం అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియా వంటి దేశాలకు వెళ్లినా, చదువుకన్నా ఉపాధి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ వంటి విపరీతమైన పోటీ ఉండే పరీక్షలపై ఆసక్తి చూపడం లేదు. స్థానిక ఎంసెట్‌తో ఏదో ఒక కాలేజీలో సీటు తెచ్చుకోవడానికే ఇష్టపడుతున్నారు. 

కాలేజీల తీరులోనూ మార్పు 
సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులు సాధారణంగా ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులనే ఎంచుకుంటున్నారు. ఎంసెట్‌లో 30 వేల ర్యాంకు వచి్చనా ఏదో ఒక కాలేజీలో సీఎస్‌ఈలో సీటు దొరుకుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఏదో ఒక ప్రైవేటు సంస్థలో చేరి ఉపాధి అవకాశాలున్న కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో సులువుగానే సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు వెళ్తున్నారు. దీనికితోడు రాష్ట్రంలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో సీట్లు పెరుగుతున్నాయి. డిమాండ్‌ లేని సివిల్, మెకానికల్‌ సీట్లు తగ్గించుకుని, సీఎస్‌ఈ, దాని అనుబంధ కంప్యూటర్‌ కోర్సుల్లో సీట్లను కాలేజీలు పెంచుకున్నాయి. ఈ సీట్లే ఇప్పుడు 58 శాతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జేఈఈ కోసం పోటీ పడాలనే ఆలోచన విద్యార్థుల్లో సన్నగిల్లుతోంది.

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరవుతున్న విద్యార్థులు ఇలా.... 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top