విత్తనాలు, పిచికారీ డ్యూటీ డ్రోన్లదే.. | Drones for rent to farmers soon | Sakshi
Sakshi News home page

విత్తనాలు, పిచికారీ డ్యూటీ డ్రోన్లదే..

Mar 6 2023 1:53 AM | Updated on Mar 6 2023 11:50 AM

Drones for rent to farmers soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సంప్రదాయ సాగు నుంచి ఆధునిక పద్ధతిలో పంటలు పండించే విధానాలు పెరుగుతున్నాయి. విత్తనాలు వేయడం నుంచి ఎరువులు చల్లడం వరకు అన్ని ప్రక్రియల్లో డ్రోన్లు గణనీయమైన పాత్ర పోషించనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల్లో వాటిని అందుబాటులో ఉంచి రైతులకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆగ్రోస్‌ వర్గాలు వెల్లడించాయి. సేవా కేంద్రాల నిర్వా హకులు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు అవసరమైన బ్యాంకు రుణాలను ఆగ్రోస్‌ ఏర్పాటు చేస్తుంది. వారికి శిక్షణతో పాటు లైసెన్స్‌ ఇచ్చేందుకు విమానయాన సంస్థతో ఆగ్రోస్‌ ఒప్పందం చేసుకుంది.

డ్రోన్‌ పైలట్‌ శిక్షణ తప్పనిసరి
ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో ట్రాక్టర్లు, స్ప్రేలు, దుక్కిదున్నే యంత్రాలు, వరి కోత మెషీన్లు తదితరాలను ఇచ్చిన వ్యవసాయశాఖ ఇప్పుడు డ్రోన్లను ఇచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. డ్రోన్‌ ద్వారా స్ప్రే చల్లడం వల్ల తక్కువ మొత్తంలో నీరు, పురుగుమందులు అవసరమవుతాయి. విత్తనాలు చల్లడంలో డ్రోన్లను వినియోగించడం వల్ల కచ్చితత్వం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే యూరియా వంటి ఎరువులను డ్రోన్ల ద్వారా చల్లితే ప్రతీ మొక్కకు చేరతాయని అంటున్నారు.

అదీగాక, డ్రోన్లతో పిచికారీ వల్ల రైతులు పురుగు మందుల దు్రష్పభావాలకు గురికాకుండా, అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చని ఆగ్రోస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో డ్రోన్‌ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుందని అంచనా. వాటిని ఆగ్రోస్‌ కేంద్రాల నిర్వాహకులకు సబ్సిడీపై ఇస్తారు. అలాగే కొంతమంది రైతులకు కలిపి గ్రూప్‌గా కూడా డ్రోన్‌ ఇచ్చే అవకాశముంది. ఒకవేళ రైతులు డ్రోన్లను కొనుగోలు చేయాలనుకుంటే సబ్సిడీ కూడా ఇవ్వనున్నారు.

సబ్సిడీ మొత్తాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. కాగా, డ్రోన్‌ను తీసుకోవాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. అలాగే డ్రోన్‌ పైలట్‌ శిక్షణ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ ఉండాలి. ఏవియేషన్‌ సర్టిఫికెట్‌ కూడా ఉండాలి.  

ఒక్కో డ్రోన్‌ ధర: సుమారు  10,00,000 రూపాయలు

డ్రోన్‌ అద్దె ఎకరాకు: రూ. 400

డ్రోన్లతో ఎకరాకు తగ్గనున్న ఖర్చు: రూ.  4,000 - 5,000

డ్రోన్లు ఏం చేస్తాయంటే.. 
ప్రధానంగా డ్రోన్లను విత్తనాలు చల్లడానికి, పురుగు మందులను స్ప్రే చేయడానికి వాడతారు. కొన్ని పంటలకు పైౖపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదళ్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటలకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు పరికరాలు అమర్చుతారు. అలాగే పంటకు చీడపీడలు ఏమైనా ఆశించాయో తెలుసుకునేందుకు ఫొటోలు కూడా తీస్తాయి. వాటిని వ్యవసాయాధికారికి పంపేలా ఏర్పాటు చేయనున్నారు.

అలాగే కాత ఎలా ఉంది? దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశముంది. ఇలా పంటకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సూక్ష్మంగా పర్యవేక్షించేలా డ్రోన్లను అందుబాటులోకి తెస్తారు. ఈ మేరకు పలు కంపెనీలతో చర్చించినట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో గ్రామాల్లో డ్రోన్లతో సాగు సులభంగా జరుగుతుందని అంటున్నారు. డ్రోన్లతో సాగు ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. 

రైతులకు ఆదాయం పెరుగుతుంది
ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల ద్వారా డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతులకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రోన్ల వినియోగంతో సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పెద్దసంఖ్యలో కూలీలు చేసే పనిని ఒక డ్రోన్‌ కొన్ని నిమిషాల్లో చేస్తుంది. కాబట్టి సాగు ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement