'దడ'గాలులు! | Disaster Management Department sends circular to district collectors on high temperatures | Sakshi
Sakshi News home page

'దడ'గాలులు!

Apr 16 2026 4:36 AM | Updated on Apr 16 2026 4:36 AM

Disaster Management Department sends circular to district collectors on high temperatures

ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఎండ ప్రచండమే... వడగాలులతో జాగ్రత్త..

ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.5 నుంచి 4.5 డిగ్రీలు పెరిగే అవకాశం 

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలో మరో వారంపాటు జాగ్రత్తగా ఉండాలి

వృద్ధులు, వ్యవసాయ, శానిటరీ, నిర్మాణ రంగ కార్మికులూ అప్రమత్తంగా ఉండాలి

చలివేంద్రాలను ప్రోత్సహించండి... పీహెచ్‌సీల్లో ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచండి

జిల్లాల కలెక్టర్లకు సర్క్యూలర్‌ పంపిన విపత్తుల నిర్వహణ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రోజురోజుకూ పెరుగుతున్న ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ వేసవి గతం కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉందని, భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగొచ్చని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను కోరింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్‌ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్‌ పంపారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వేడిగాలులు అధికమవుతాయని ఈ సర్క్యులర్‌లో హెచ్చరించారు. 

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో మరో వారంపాటు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41–44 డిగ్రీల వరకు నమోదవుతాయని, సాధారణం కంటే 1.5 నుంచి 4.5 డిగ్రీలు పెరిగే అవకాశముందన్నారు. రాత్రుళ్లు కూడా వేడి తగ్గకపోవచ్చని, అందువల్ల వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, వ్యవసాయ, నిర్మాణ, శానిటరీ, రవాణా రంగాల కార్మికులు, పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలు, వన్యప్రాణులు, పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించారు. 

ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, మాల్స్, బస్టాండులు, పబ్లిక్‌ భవనాల్లో కూలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయించాలని, ఎన్జీవోలు ఇతర సంస్థల ద్వారా చలివేంద్రాలను ప్రోత్సహించి వాటిలో మంచినీటితోపాటు మజ్జిగ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీల్లో ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచాలని చెప్పారు. ఎండలు, వేడి గురించి ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా స్థాయి నోడల్‌ అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, రోజూ జిల్లాల వారీ పరిస్థితులపై తమకు నివేదికలు పంపాలని పేర్కొన్నారు.  

వడదెబ్బ బాధితులకు చికిత్స: మంత్రి రాజనర్సింహ 
» రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందేలా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో బుధవారం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన వేసవి పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రుల్లో అవుట్‌పేషెంట్లు, ఇన్‌పే షెంట్లు, వారి సహాయకులకు తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  
ఈ జాగ్రత్తలు ముఖ్యం.. 

»  ప్రజలు ఎండల ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండాలని, తరచూ నీరు, ఓఆర్‌ఎస్, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలన్నారు. తేలికపాటి దుస్తులు ధరించడం, తలకు కవర్‌ ఉపయోగించడం ద్వారా ఎండ తీవ్రతను తగ్గించుకోవచ్చని సూచించారు. వడదెబ్బ లక్షణాలపై కూడా వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగడం, తల తిరగడం, వాంతులు, మూర్చ, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

9 జిల్లాలకు వడగాలుల హెచ్చరిక 
»  బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో 42.8 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. 

ఆదిలాబాద్, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాల్పుల ప్రభావం ఉంటుందంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. బుధవారం వడదెబ్బకు గురై నల్లగొండ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన అంతటి స్వామి (59), చిట్యాలకు చెందిన అమరోజు పాండు (65) వడదెబ్బకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందారు. 

Advertisement
 
Advertisement
Advertisement