ఫిట్‌నెస్‌లేని అంబులెన్సులు! | Dilapidated Ambulances in Telangana | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌లేని అంబులెన్సులు!

Jun 1 2026 1:44 AM | Updated on Jun 1 2026 1:44 AM

Dilapidated Ambulances in Telangana

హైదరాబాద్‌లో సగానికిపైగా సామర్థ్యంలేని వాహనాలే 

కాలంచెల్లిన వాహనాల్లోనూ రోగుల తరలింపు 

275 వాహనాలపై కేసులు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులను సత్వరమే ఆస్పత్రులకు తరలించే అంబులెన్సులే అస్వస్థతకు గురయ్యాయి! సామర్థ్యం లేకుండానే రోడ్డెక్కి పరుగులు తీస్తున్నాయి. అంబులెన్సుల నిర్వహణలో వాహన యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు చెందిన కొన్ని అంబులెన్సులు మినహా సగానికిపైగా అంబులెన్సులు ఫిట్‌నెస్‌ సరి్టఫికెట్‌ లేకుండానే తిరుగుతున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది.

మరోవైపు కొందరు వాహనదారులు మారుతీ ఓమ్ని వంటి వాహనాలను అంబులెన్సులుగా మార్చి రోగుల తరలింపు కోసం వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాధారణ వాహనాలను అంబులెన్స్‌లుగా లేదా ఇతర ప్రయోజనాలకు అనుగుణంగా మార్చాలంటే రవాణాశాఖ అనుమతి తప్పనిసరి. కానీ చాలా మంది వాహనదారులు అనుమతుల్లేకుండానే వాహనాల్లో అత్యవసర సేవలకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేసుకొని అంబులెన్సులుగా వినియోగిస్తున్నారు. 

ఏటా తనిఖీలు తప్పనిసరి.... 
నిబంధనల ప్రకారం అన్ని రకాల రవాణా వాహనాలకు ఆర్టీఏ అధికారులు ఏటా తనిఖీలు నిర్వహించి సామర్థ్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలి. అంబులెన్సులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. కానీ సాధారణంగా అంబులెన్సులను అత్యవసరమైనవిగా భావించి ఎలాంటి తనిఖీలు నిర్వహించడం లేదు. దీంతో వాహన యజమానులు దీన్ని అవకాశంగా తీసుకొని తనిఖీలకు హాజరుకావట్లేదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. అధికారిక వివరాల ప్రకారం హైదరాబాద్‌లో మొత్తం 10,059 అంబులెన్సులు నమోదై ఉన్నాయి. వాటిలో కేవలం 4,655 వాహనాలకే చెల్లుబాట య్యే ఫిట్‌నెస్‌ సరి్టఫికెట్‌ ఉంది. మిగతా 5,404 అంబులెన్సులు ఫిట్‌నెస్‌ లేకుండానే నడుస్తున్నాయి. అంటే మొత్తం అంబులెన్సుల్లో సుమారు 54 శాతం వాహనాలు భద్రతా ప్ర మాణాల తనిఖీలకు దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

కాలం చెల్లినవి కూడా... 
ఇవి కాకుండా 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన అంబులెన్సులు 2,965 వరకు ఉన్నాయి. కేంద్ర మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం రోడ్డు భద్రత దృష్ట్యా 15 ఏళ్లు దాటిన వాహనాలను వినియోగించడానికి అనుమతి ఉండదు. రవాణా వాహనాలు నిర్దేశిత గడువు దాటినకొద్దీ వాటిలో యాంత్రిక లోపాలు, రవాణాలో ప్రమాదాల ముప్పు అధికమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్సులు సాంకేతికంగా పటిష్టంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. రవాణా శాఖ చేపట్టిన తనిఖీల్లో 2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు 275 అంబులెన్సులపై కేసులు నమోదయ్యాయి. ఫిట్‌నెస్‌ లేకపోవడం, నిబంధనల ఉల్లంఘనలు, పాత వాహనాల వినియోగం వంటి కారణాలతో ఈ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అంబులెన్సులను వినియోగించే వాహన యజమానులు స్వచ్ఛందంగా ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరు కావాలని.. వాహనాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రవాణాశాఖ అదనపు కమిషనర్‌ రమేశ్‌ సూచించారు.   

Advertisement
 
Advertisement
Advertisement