నాడు మైక్‌ ఇవ్వలేదు.. నేడు వాకౌట్‌ చేశారు! | Deputy CM Bhatti Vikramarka On Fires On BRS | Sakshi
Sakshi News home page

నాడు మైక్‌ ఇవ్వలేదు.. నేడు వాకౌట్‌ చేశారు!

Mar 25 2026 6:19 AM | Updated on Mar 25 2026 6:19 AM

Deputy CM Bhatti Vikramarka On Fires On BRS

విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు అవమానించారు 

బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: ‘పదేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు సభలో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వకుండా ఎన్నోసార్లు నన్ను అవమానించారు. కనీసం సభ్యులుగా గౌరవించేవారు కాదు. నాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వలేదు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా మాట్లాడుతుంటే వినాల్సిందిపోయి బడ్జెట్‌ కాగితాలను చించి చెవిలో పువ్వుల్లాగా పెట్టుకుని వెళ్లిపోవడం సంస్కారమా? సీఎం స్థానంలో రేవంత్‌ రెడ్డి, ఇక్కడ భట్టి విక్రమార్క, అక్కడ శ్రీధర్‌ బాబు కూర్చోవడం ఏమిటి? అనే చులకన భావంతో చూడొద్దు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ప్రజాతీర్పును గౌరవించాలి’ అని బీఆర్‌ఎస్‌ సభ్యులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్‌పై శాసనసభలో మంగళవారం రెండోరోజు నిర్వహించిన చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు. సభను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని, బడ్జెట్‌ పద్దుల పుస్తకాలను సకాలంలో ఇవ్వడం లేదని ఆరోపిస్తూ భట్టి విక్రమార్క సమాధానాన్ని బహిష్కరిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ సభ్యులు హరీశ్‌రావు ప్రకటించి తమ పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్‌ చేశారు. ప్రశ్నించడానికి బీఆర్‌ఎస్‌ సభ్యులకు వీలైనంత సమయమిచి్చనా వాకౌట్‌ చేయడం సరికాదని భట్టి తప్పుబట్టారు. నాడు ఎన్ని అవమానాలకు గురిచేసినా తాము వాకౌట్‌ చేయలేదన్నారు.   

వాస్తవికతకు దగ్గరగా... 
ఆదాయం లేకున్నా ఏటా 20 శాతం బడ్జెట్‌ను గత బీఆర్‌ఎస్‌ సర్కారు పెంచిన తరహాలో పెంచుకుంటూ పోవడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. అలా చేస్తే ఈ పాటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.5 లక్షల కోట్లకు చేరేదన్నారు. ఏటా 6 శాతం వృద్ధితో బడ్జెట్‌ అంచనాలను పెంచుకుంటూ పోతున్నామని, మరో రెండుమూడేళ్లలో వాస్తవిక గణాంకాలకు దగ్గరగా ప్రతిపాదనలను తీసుకొస్తామని చెప్పారు. ఎన్నికల కోసం రైతు భరోసా చెల్లించారని బీఆర్‌ఎస్‌ చేసిన ఆరోపణలను భట్టి తోసిపుచ్చారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు విడతల్లో రూ.లక్ష రుణమాఫీ చేయడంతో వడ్డీలపై వడ్డీలు పెరిగి రైతులు నష్టపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలను గాలికి వదిలేసిందన్నారు. తాము వచ్చాక రాష్ట్ర వాటా రూ.3 వేల కోట్లను చెల్లించి రూ.10వేల కోట్ల కేంద్ర నిధులను సాధించామని చెప్పారు.   

అప్పులకే ఏటా రూ.93,194 కోట్లు 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, పరిపాలన వ్యవస్థను విధ్వంసం చేసి ందని భట్టి ఆరోపించారు. రాష్ట్ర అప్పులు, తిరిగి చెల్లింపులు 2014–15లో రూ.9,580 కోట్లు మాత్రమే ఉండగా, గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులతో 2023–24 నాటికి రూ.25,350 కోట్లు, 2024–25 నాటికి రూ.66,545 కోట్లు, 2025–26 నాటికి రూ.93,194 కోట్లు కట్టాల్సి వచి్చందన్నారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం రూ.1,59,165 కోట్ల అప్పులు చేసి రూ.1,85,090 కోట్ల అప్పులను తిరిగి చెల్లించిందన్నారు.  

మోదీ అప్పులు రూ.140 లక్షల కోట్లు 
కేంద్ర ప్రభుత్వం 1950–51 నుంచి 2013–14 మధ్యకాలంలో 13 మంది ప్రధానుల ఆధ్వర్యంలో రూ.56.66 లక్షల కోట్లు అప్పులు చేస్తే ప్రస్తుత ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో ఏకంగా రూ.140 లక్షల కోట్లు కొత్త అప్పులు చేశారని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర అప్పులపై బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆయన దీటుగా బదులిచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూపాయికి 30 పైసలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయన్నారు. తెలంగాణ ఏం పాపం చేసింది. దేశంలో అంతర్భాగం కాదా? కేంద్రం ఇలా ఇవ్వడమే చీటింగ్‌ అని ఏలేటిని నిలదీశారు.

రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలను యూనిట్‌కు రూ.10 పెంచినట్టు ఏలేటి చేసిన ఆరోపణ లు అవాస్తమని తప్పుబట్టారు. నాడు మహాత్మాగాం«దీని భౌతికంగా లేకుండా చేశారని, ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించారని బీజేపీపై మండిపడ్డారు. భట్టి శాసనమండలిలో సైతం బడ్జెట్‌పై చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అర్ధరాత్రి వరకు సమాధానమిచ్చారు.

పార్టీ ఆఫీస్‌ నడిపినట్టు సభ నడిపారు: మంత్రి శ్రీధర్‌బాబు 
బీఆర్‌ఎస్‌ హయాంలో సభను ఆ పార్టీ ఆఫీస్‌ను నడిపినట్టు నడిపారని  మంత్రి డి.శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ సభ్యులకు తగిన సమయమిచ్చి వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌ను తీవ్రంగా తప్పుబడుతూ సభలో మాట్లాడారు.  

Advertisement
 
Advertisement
Advertisement